
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతిక రంగంలో సంచలనాలను సృష్టిస్తోంది. ప్రతి రంగంలోనూ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ మానవాళిని తుడిచిపెట్టే అవకాశం ఉందని.. ''గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ''గా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ - కెనడియన్ కంప్యూటర్ శాస్త్రవేత్త 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) ఆందోళన వ్యక్తం చేశారు.
లాస్ వెగాస్‌లో జరిగిన Ai4 సమావేశంలో హింటన్ మాట్లాడుతూ.. ఏఐ మానవాళికి ప్రమాదంగా మారుతుందని, దీనిపై నియంత్రణ కలిగి ఉండాలని హెచ్చరించారు. పెద్దవాళ్ళు.. పిల్లలకు మిఠాయి ఇచ్చి ఏమార్చిన విధంగా భవిష్యత్తులో ఏఐ మనుషులను నియంత్రించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
మోసం చేయడం, దొంగిలించడం వంటివి కూడా ఏఐ సులభంగా చేసేస్తోంది. ఇటీవల ఒక ఏఐ ఇంజినీర్ వ్యక్తిగత సమాచారాన్ని బయటకు చెప్పేస్తా అని భయపెట్టిన ఉదంతాన్ని హింటన్ ఉదాహరణగా చెప్పారు. కాబట్టి ఏఐ భావోద్వేగ స్పందనలను కలిగి ఉండాలి. అప్పుడే సమాజహితంగా ఉంటుందని అన్నారు. ఏఐలో కరుణ భావాన్ని పెంపొందించడం అత్యంత ముఖ్యమైనదని హింటన్ వెల్లడించారు. తల్లి - బిడ్డ సంబంధం మాదిరిగా ఏఐను రూపొందించాలని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: మినిమమ్ బ్యాలెన్స్: ఏ బ్యాంకులో ఎంత ఉండాలంటే?
ఏఐ ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇది కొత్త భాషను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేము. అయితే ఏఐ వల్ల ప్రమాదాలు ఉన్నప్పటికీ.. వైద్య రంగంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని జియోఫ్రీ హింటన్ అన్నారు.