
ఆర్లాండో: జర్మన్ ఐటీ దిగ్గజం శాప్ కొత్తగా బెంగళూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని(సీవోఈ) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులో సుమారు 15,000 సీటింగ్ సామర్థ్యంతో దీన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. బెంగళూరులోని దేవనహళ్ళిలో 41 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానుంది. 1998 నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న శాప్ ల్యాబ్స్ ఇండియాలో ప్రస్తుతం హైదరాబాద్ సహా అయిదు నగరాల్లో 14,000 మంది సిబ్బంది ఉన్నారు.
జర్మనీ వెలుపల కంపెనీకి అతి పెద్ద పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రం ఉన్నది భారత్‌లోనే. తమకు అతి పెద్ద డెవలప్‌మెంట్ సెంటర్స్‌లో భారత్ కూడా ఒకటని శాప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు ముహమ్మద్ ఆలం తెలిపారు. ఆటోమొబైల్, హెల్త్‌కేర్, రిటైల్ సహా వివిధ వ్యాపార విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నట్లు వివరించారు. భారతీయ కంపెనీలు వేగవంతంగా కృత్రిమ మేథని (ఏఐ) అందిపుచ్చుకుంటున్నట్లు చెప్పారు.