
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తోపాటు మరికొందరు అధికారులపై రూ.2,929 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. గత నెలలో సీబీఐ దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఎఫ్‌ఐఆర్) ఆధారంగా ఈడీ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు నష్టం కలిగించాయని, దాంతో ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించామని సీబీఐ ఇప్పటికే తెలిపింది.
ముంబైలో అనిల్ అంబానీ, ఆర్‌కామ్‌కు సంబంధించిన ఆరు ప్రదేశాల్లో ఈ సోదాలు నిర్వహించారు. అప్పుగా తీసుకున్న బ్యాంకు నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయో, రుణాలు ఎందులోకి మళ్లించబడ్డాయో నిర్ధారించడానికి ఆధారాలను సేకరించే లక్ష్యంతో ఈ సోదాలు నిర్వహించారు. జూన్ 13న ఆర్‌కామ్, అంబానీలను ఫ్రాడ్ గుర్తించిన ఎస్బీఐ జూన్ 24న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదిక పంపింది.
ఇటీవల అనిల్ అంబానీని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) సైతం మోసపూరితం (ఫ్రాడ్)గా వర్గీకరించింది. దాదాపు దశాబ్దం క్రితం ఆర్‌కామ్ తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలిపిన సమాచారంలో బీవోబీ పేర్కొంది. ఆర్‌కామ్‌కు బీవోబీ రూ.1,600 కోట్ల రుణాన్ని, మరో రూ.862.5 కోట్లను లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మంజూరు చేసింది. ఈ మొత్తం రూ.2,462.5 కోట్లలో ఈ ఏడాది ఆగస్ట్ 28 నాటికి రూ.1,656.07 కోట్లు బకాయి పడింది. ఈ నేపథ్యంలో కంపెనీతో పాటు ప్రమోటర్ అనిల్ అంబానీని ‘ఫ్రాడ్’గా వర్గీకరిస్తూ బీవోబీ నుంచి సెప్టెంబర్ 2న లేఖ అందినట్లు ఆర్‌కామ్ వెల్లడించింది. ఈ లేఖ ప్రకారం.. 2017, జూన్ 5 నుంచి బీవోబీ ఈ ఖాతాను మొండిబకాయిగా కొనసాగిస్తోంది.
ఇదీ చదవండి: భారత వృద్ధి అంచనాలు అప్!
ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో అంబానీని ఈడీ ప్రశ్నించింది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాల్లో రూ.3,000 కోట్లు నిధులు మళ్లించినట్లు ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బ్యాంకు ప్రమోటర్లు కూడా రుణాలు మంజూరు కావడానికి ముందు చెల్లింపులు పొందినట్లు కనుగొంది. ఇది క్విడ్ ప్రో కోకు దారితీసినట్లు సూచిస్తుంది.