
ఫోర్త్ సిటీ భవిష్యత్తు తరాలకు మరో హైటెక్ సిటీ
అభివృద్ధి పనుల ప్రారంభంతో మూడు రెట్లు పెరిగిన ధరలు
ఓఆర్‌ఆర్–త్రిబుల్ ఆర్ గ్రోత్ కారిడార్లలో భూమి బంగారమే..
రేపటి అర్బన్ ఇండియా విజనే భారత్ ఫ్యూచర్ సిటీ. కృత్రిమ మేధస్సు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ తయారీ, పర్యాటకం, స్పోర్ట్స్, చలనచిత్ర నిర్మాణం, ఆరోగ్యం వంటి అన్ని రంగాలకు ప్రత్యేకంగా జోన్‌లను కేటాయిస్తూ.. రేపటి తరాలకు పర్యావరణ హితమైన నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే పదేళ్లలో సుమారు 10 లక్షల ఉద్యోగులు పనిచేయనున్న ఈ ఫోర్త్ సిటీలో ఈ మేరకు హౌసింగ్ డిమాండ్ ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు కొత్త మనోహర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు దక్షిణం వైపున 765 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చెందనున్న ఈ సమగ్ర పట్టణ ప్రాంతం భారత్‌కే తలమానికంగా
నిలుస్తుందని తెలిపారు. –సాక్షి, సిటీబ్యూరో
ఇప్పటికే ఫేజ్–1లో 14 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 30 వేల ఎకరాల భూమిని సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో రహదారుల నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. పనుల ప్రారంభమైతే ఆయా ప్రాంతాల్లోని భూమి బంగారంగా మారుతుంది. వచ్చే రెండేళ్లలో ఫ్యూచర్ సిటీలోని ప్రాంతాలలో భూముల ధరలు మూడు రెట్లు పెరగడం ఖాయం. మీర్‌ఖాన్‌పేట, ముచ్చర్ల, గుమ్మడవల్లి, లేమూరు, యాచారం, కందుకూరు, నందివనపర్తి, కడ్తాల్, ఆమన్‌గల్ ప్రాంతాల్లో అభివృద్ధి జోరుగా ఉంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో ఎకరం రూ.2–5 కోట్లు ఉండగా.. వచ్చే రెండేళ్లలో రూ.10–15 కోట్లకు చేరుతుంది.
గ్రోత్ కారిడార్‌లో బంగారమే..
ఔటర్ రింగ్ రోడ్డుతో అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితమైంది. కానీ, రీజినల్ రింగ్ రోడ్డు, దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్‌లతో సగం తెలంగాణ ప్రాంతం అభివృద్ధి నెక్ట్స్ లెవల్‌కు చేరుతుంది. ఇప్పటికే ఆయా కీలక ప్రాజెక్ట్‌లపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఔటర్‌కు ఇరువైపులా గ్రోత్ కారిడార్ కిలో మీటర వరకే కేటాయించారు. దీంతో మల్టీ పర్పస్ జోన్‌గా మారిన ఆ ప్రాంతంలో హైరైజ్ అపార్ట్‌మెంట్లు, భారీ గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు వచ్చాయి. ఇక, ఇరువైపులా 5 కి.మీ. వరకూ గ్రోత్ కారిడార్‌గా పరిగణించనున్న ట్రిబుల్ ఆర్ ప్రాంతంలో అభివృద్ధి ఇంతకు రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఈ కారిడార్లలో ఎక్కడ భూమి కొన్నా బంగారంగా మారడం ఖాయం.
శంషాబాద్ మెయిన్ సిటీ..
బేగంపేట విమానాశ్రయం ప్రారంభించిన తొలినాళ్లలో హైదరాబాద్‌కు శివారు ప్రాంతమది. కానీ, ఇప్పుడు సిటీకి మెయిన్ సెంటర్‌గా అభివృద్ధి చెందింది. ఇదే తరహాలో ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డుల అభివృద్ధితో సమీప భవిష్యత్తులో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కూడా ప్రధాన నగరంగా మారుతుంది. ఫోర్త్ సిటీ నుంచి శంషాబాద్‌కు 20 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గమంతా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. హైటెక్ సిటీలతో ఐటీ కంపెనీల రాకతో గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ఎలాగైతే అభివృద్ధి చెందాయో అంతకు రెట్టింపు వేగంతో మహేశ్వరం అభివృద్ధి చెందుతుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎయిరో స్పేస్ కంపెనీల రాకతో రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. బెంగళూరు హైవే, ఫ్యూచర్ సిటీలతో అనుసంధానమై ఉండటం అదనపు అంశాలు.
అనుమతులు వేగం..
గత ప్రభుత్వంలో ఎలాగైతే టీఎస్–బీపాస్ ద్వారా 21 రోజుల్లోనే పారిశ్రామిక పెట్టుబడులు, సంస్థలకు అనుమతులు ఇచ్చారో.. అదే తరహాలో హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు టైం లైన్ పెట్టి అనుమతులను ఇవ్వాలి. దీంతో ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు బిల్డర్లు ముందుకు రావడంతో పాటు పన్నులు, ఫీజుల రూపంలో ప్రభుత్వానికి బోలెడంత ఆదాయం సమకూరుతుంది.
కొత్త మనోహర్‌రెడ్డి, రియల్ ఎస్టేట్ నిపుణులు