భారత్‌పై డాలర్ల వెల్లువ ! పెరిగిన విదేశీ పెట్టుబడులు

Foreign Direct Investment Inflow Raised - Sakshi

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు కొనసాగుతోంది. ఎంతలా అంటే ప్రపంచంలో మరే ఇతర ఈక్విటీ మార్కెట్‌ చూడని లాభాలను గడచిన ఏడాది కాలంలో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ నమోదు చేసింది, ఈ సానుకూల వాతావరణానికి తగ్గట్టే విదేశీ ఇన్వెస్టర్లు సైతం ఇండియా వైపు చూస్తున్నారు. తమ పెట్టుబడులకు భారత్‌ అనువైన చోటుగా ఎంచుకుంటున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ జారీ చేసిన వివరాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

90 శాతం పెరుగుదల
కరోనా సంక్షోభం తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకే మిగిలిన దేశాల కంటే ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇండియాకు డాలర్ల వరద మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 22.53 బిలియన్‌ డాలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ 11.84 బిలియన్‌​ డాలర్లుగా ఉంది. అంటే ఒక్క ఏడాది కాలంలోనే పెట్టుబడులు 90 శాతం పెరిగాయి.

నగదు రూపంలోనే
కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల జారీ చేసిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మొదటి మూడు నెలలులోనే 17.57 బిలియన్‌ డాలర్లు నిధులు నగదు రూపంలో వచ్చాయి. అంతకు ముందు ఏడాదిలో ఇదే కాలానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నగదు విలువ కేవలం 6.56 బిలియన్‌ డాలర్లే. ఏడాది వ్యవధిలో నగదు రూపంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 168 శాతం పెరిగాయి.

ఎక్కువగా ఈ రంగానికే
విదేశీ ప్రత్యక్ష పెట్టుబుడలకు సంబంధించి నగదు రూపంలో వచ్చిన పెట్టుబడుల్లో 27 శాతం వాటాతో సింహభాగం ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకే వచ్చాయి. ఆ తర్వాత ఐటీ రంగానికి 17 శాతం సర్వీస్‌ సెక్టార్లోకి 11 శాతం పెట్టుబడులు వచ్చాయి.

కర్నాటకకు ప్రాధాన్యం
విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు కర్నాటకను సేఫ్‌ ప్లేస్‌గా ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది వచ్చిన పెట్టుబడుల్లో 48  శాతం కర్నాటక రాష్ట్రానికి తరలిపోగా ఆ తర్వాత మహారాష్ట్రకి 23 శాతం, ఢిల్లీకి 11 శాతం నిధులు వచ్చాయి. ఆటోమొబైల్‌, ఐటీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉండటం ఆ రాష్ట్రాలకు సానుకూల అంశంగా మారింది. 

రికవరీయే కారణం
విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌పై ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణాల్లో కోవిడ్‌ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ త్వరగా రికవరీ మోడ్‌లోకి రావడం ప్రదానంగా నిలిచింది. దీనికి  ఎకానమీ మూలాల పటిష్టత, కార్పొరేట్‌ ఆదాయాలు బాగుండడం వంటి అంశాల దన్నుగా నిలిచాయి. ఫలితంగా రిటైల్, వ్యవస్థాగత పెట్టుబడులు మార్కెట్‌లోకి భారీగా వస్తున్నాయని  మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.

చదవండి : స్టాక్‌ మార్కెట్‌లో రంకెలేస్తున్న బుల్‌.. ప్రపంచంలో భారత్‌ టాప్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top