ఇంటికి ఫైర్‌ ప్రూఫ్‌ ఉండాల్సిందే.. | Fire proof must for residence | Sakshi
Sakshi News home page

ఇంటికి ఫైర్‌ ప్రూఫ్‌ ఉండాల్సిందే..

May 24 2025 2:12 PM | Updated on May 24 2025 2:16 PM

Fire proof must for residence

ప్రతి నిర్మాణానికి ఫైర్‌ ఎక్విప్‌మెంట్‌ తప్పనిసరి

జాగ్రత్తలపై అవగాహన ఉండాల్సిందే..

నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదు

నివాసం, వాణిజ్యం, కార్యాలయం.. నిర్మాణం ఏదైనా సరే అగ్ని ప్రమాద నివారణ ఉపకరణాలు తప్పనిసరి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా జరిగే ప్రమాదం వెలకట్టలేనిది. ఆస్తి, ప్రాణ నష్టాన్ని భర్తీ చేయలేనిది. అందుకే ప్రతీ భవనంలోనూ ఫైర్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటు చేసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వాటిని నిర్వహణ చేయాలి లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు అవి పనిచేయవు. ఈమధ్య కాలంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్, సిలిండర్‌ పేలుళ్లు.. ఇలా కారణాలనేకం.

🔸 హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యా, వైద్య సదుపాయాలు, కాస్మోపాలిటన్‌ కల్చర్, తక్కువ జీవన వ్యయం, అందుబాటు ధరలు, మెరుగైన మౌలిక వసతులు ఇలా రకరకాల కారణాలతో నగరంలో జనాభా, వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నివాస, వాణిజ్య భవనాలలో అగ్ని ప్రమాద భద్రతా నిబంధనలు, ఉత్పత్తులు మనశ్శాంతి ఇవ్వడమే కాకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. చిన్న మంట ఒక గదిని దహించేందుకు సగటున మూడు నిమిషాల సమయం పడుతుంది. అందుకే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వేగవంతమైన ప్రతిస్పందన అత్యవసరం. ప్రతిస్పందనలో సెకన్ల సమయం ఆలస్యమైనా.. విపత్తు తీవ్రత పెరుగుతుంది. 
– సాక్షి, సిటీబ్యూరో

ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి..? 
అపార్ట్‌మెంట్లు:  
🔸 ప్రతీ ఫ్లాట్‌ లోపల స్మోక్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలి. 
🔸 మంటలను ఆర్పే పరికరం, యంత్రం ఉండాలి. ముఖ్యంగా వంట గదిలో తప్పనిసరి. 
🔸 మంటలను నియంత్రించే తలుపులు, కిటికీలు ఉండాలి. కనీసం 30–60 నిమిషాల పాటుతట్టుకునే శక్తి ఉండాలి.

లిఫ్ట్‌:  
🔸 లిఫ్ట్‌ డోర్లకు అగ్నిని తట్టుకునే శక్తి ఉండాలి. 
🔸 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలలో ప్రత్యేకంగా అగ్నిమాపక సిబ్బందిని నియమించుకోవాలి. 
🔸 లిఫ్ట్‌ ముందు భాగంలో ‘అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్‌ను వినియోగించరాదు’, ‘మెట్ల మార్గం’.. తదితరాలను సూచించే సైన్‌ బోర్డులను ఏర్పాటు చేయాలి.

బేస్‌మెంట్, పార్కింగ్‌ ఏరియా 
🔸    ఆటోమెటిక్‌ స్ప్రింక్లర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 
🔸    పొగను గుర్తించే పరికరాలు, అలారం ఉండాలి. 
🔸    పార్కింగ్, ప్రధాన భవనం మధ్య భాగంలో మంటలను నియంత్రించే తలుపులను ఏర్పాటు చేయాలి. 
🔸    ఇంధనం, రంగులు, వార్నిష్‌ వంటి మండే గుణం ఉన్న వస్తువులను భద్ర పర్చకూడదు. 
🔸    అగ్ని ప్రమాదం జరిగే తప్పించుకునే సైన్‌ బోర్డులు, లైటింగ్‌లను ఏర్పాటు చేయాలి. 

కారిడార్లు, కామన్‌ ఏరియాలు: 
🔸    ప్రతీ 30 మీటర్ల దూరంలో ఒక మాన్యువల్‌ కాల్‌ పాయింట్ల (ఎంసీపీ) ను ఏర్పాటు చేయాలి. 
🔸    కారిడార్లలో 2 గంటల పాటు మంటలను తట్టుకునే గుణం ఉన్న గోడలు, తలుపులను ఏర్పాటు చేయాలి. 
🔸    ఫైర్‌ అలారం స్పీకర్లు, అత్యవసర లైట్లు, మెరిసే ఎగ్జిట్‌ గుర్తులను పెట్టాలి. 

అసెంబ్లీ ఏరియా 
🔸    ఓపెన్‌ స్పేస్, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సురక్షితమైన అసెంబ్లీ జోన్‌లను గుర్తించాలి. 
🔸    లిఫ్ట్, మెట్ల దగ్గర అగ్నిమాపక సంకేతాలు, గుర్తులను ఏర్పాటు చేయాలి. 
🔸    బేస్‌మెంట్, లిఫ్ట్‌ లాబీలలో పొగ తొలగింపు వ్యవస్థను పెట్టాలి. 
🔸    సహజ, యాంత్రిక వెంటలేషన్‌ తప్పనిసరి. 

అగ్నిమాపక మౌలిక సదుపాయాలు 
🔸    15 మీటర్ల కంటే ఎత్తయిన భవనంలో ప్రతీ అంతస్తులోనూ నీటిని సరఫరాను అందించే పైప్‌లు, హోస్‌ రీల్‌ ఉండాల్సిందే. 
🔸    ఫైర్‌ హైడ్రంట్‌ సిస్టమ్‌ ఉండాలి. 
🔸    అండర్‌గ్రౌండ్, ఓవర్‌హెడ్‌ ఫైర్‌ వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌లను ఏర్పాటు చేయాలి. 
🔸    డీజిల్‌ లేదా ఎలక్ట్రిక్‌తో నడిచే ఫైర్‌ పంప్‌ రూమ్‌ తప్పనిసరి.

రూఫ్, టెర్రర్‌.. 
🔸    అగ్నిమాపక సిబ్బంది వెళ్లేందుకు వీలుగా ఉండాలి. 
🔸    మంటలను ఆర్పేందుకు ప్రత్యేకంగా వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ తప్పనిసరి. 
🔸    హైరైజ్‌ భవనాలతో ప్రతీ 24 మీటర్ల దూరంలో అత్యవసర సమయంలో ఆశ్రయం పొందేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి. 

మెట్లు..
🔸    15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలకు రెండు మెట్ల మార్గాలు తప్పనిసరి.  
🔸    అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకునేందుకు ప్రత్యేకంగా మెట్ల మార్గం ఉండాలి. 
🔸    మెట్ల మార్గంలోని తలుపులు కనిష్టంగా 1–2 గంటల పాటు మంటలను నియంత్రించే గుణం ఉన్న వాటినే ఏర్పాటు చేయాలి. 
🔸    పొగ ప్రవేశించకుండా నిరోధించే మెట్లను నిర్మించుకోవాలి. 

చేయాల్సినవి.. 
🔸    తప్పించుకునే మార్గాలు, మెట్ల మార్గాలు, అగ్ని ప్రమాద హెచ్చరికలు, సూచికలను గుర్తించుకోవాలి. 
🔸    ఇంట్లో లేనప్పుడు విద్యుత్‌ మెయిన్స్‌ను ఆపివేయాలి. 
🔸    ఇంట్లో అగ్ని మాపక యంత్రం ఉంచుకోవాలి. 
🔸    ఇసుకతో నిండిన అగ్నిమాపక బకెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

చేయకూడనివి
🔸  అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫర్నీచర్‌ వెనుక లేదా టాయిలెట్లతో దాక్కోకూడదు. 
🔸    ఐఎస్‌ఐ ప్రమాణాలు ఉన్న ఉత్పత్తులను మాత్రమే వాడాలి.  
🔸    అనధికారి విద్యుత్‌ కనెక్షన్లు తీసుకోవద్దు. మీటర్‌ను ఓవర్‌లోడ్‌ చేయకూడదు. 
🔸    ప్రమాదకర పదార్థాలు, ఉత్పత్తులను నిల్వ చేయకూడదు. 
🔸    ఫైర్‌ ఎగ్జిట్‌ పాయింట్లకు అడ్డంగా ఏమీ పెట్టరాదు.  
🔸    విద్యుత్‌ వ్యవస్థల మరమ్మతులు, నిర్వహణ తప్పనిసరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement