సానుకూల సెంటిమెంటు కొనసాగొచ్చు

Experts prediction on stock market performance this week - Sakshi

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి నిర్ణయాలు

స్థూల ఆర్థిక గణాంకాలు కీలకం

క్యూ1 ఆర్థిక ఫలితాలపై దృష్టి

వరుస లాభాల నేపథ్యంలో స్థిరీకరణకూ అవకాశం

ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అంచనా

ముంబై: ఆర్‌బీఐ ద్రవ్య పరపతి నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు. జూన్‌ కార్పొరేట్‌ త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్‌ వ్యాఖ్యలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను సమతూకం చేసుకోవాలి. పతనాన్ని కొనుగోలుకు అవకాశంగా మలుచుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు.

‘‘మార్కెట్‌ పరిస్థితులను గమనిస్తే సానుకూల సెంటిమెంట్‌ మరికొంత కాలం కొనసాగవచ్చు. నిఫ్టీ 17వేల కీలక నిరోధాన్ని అధిగమించి 17,158 వద్ద స్థిరపడింది. సానుకూల సెంటిమెంట్‌ కొనసాగితే 17,350 – 17,500 శ్రేణిలో నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. వరుస లాభాల నేపథ్యంలో మార్కెట్‌ కొంత స్థిరీకరణకు అవకాశం లేకపోలేదు. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 16,950–16,800 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. రానున్న రోజుల్లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై దూకుడును ప్రదర్శించకపోవచ్చనే అంచనాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో గతవారం సూచీలు దాదాపు మూడుశాతం ర్యాలీ చేశాయి. మెటల్, ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ 1500 పాయింట్లు, నిఫ్టీ 439 పాయింట్లు లాభపడ్డాయి.

తొమ్మిది నెలల తర్వాత కొనుగోళ్లు
కొంతకాలంగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. తొమ్మిది నెలల వరుస అమ్మకాల తర్వాత ఈ జూలైలో రూ.4,989 కోట్ల విలువైన షేర్లను కొన్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడటం, దేశీయ కార్పొరేట్‌ జూన్‌ క్వార్టర్‌ ఫలితాలు మెప్పించడం ఇందుకు కారణమని నిపుణులంటున్నారు. గత నెల జూన్‌లో రూ. 50,203 కోట్లను ఉపసంహరించుకున్నారు. ‘‘రూపాయి రికవరీ, అందుబాటు ధరల వద్ద క్రూడాయిల్‌ లభ్యత తదితర అంశాల నేపథ్యంలో మరికొంతకాలం పాటు ఎఫ్‌ఐఐలు ధోరణి సానుకూలంగా ఉండొచ్చు’’ అని యస్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషకుడు హితేశ్‌ జైన్‌ తెలిపారు.  

మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషిస్తే..,  
ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ కమిటీ నిర్ణయాలు  
అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పాలసీ నిర్ణయాలు వెల్లడి తర్వాత మార్కెట్‌ వర్గాలు తాజాగా ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలపై దృష్టి సారించాయి. సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభం అవుతుంది. కమిటీ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించనున్నారు. ఈ జూన్‌ ద్వైమాసిక సమీక్షలో రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. రిటైల్‌ ద్రవ్యోల్బణ ఇప్పటికీ గరిష్టస్థాయిలో కొనుసాగుతున్న నేపథ్యంలో, ఈ సమీక్షలో రెపోరేటు పెంపు 0.25 – 0.50% మధ్య ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. పాలసీ వెల్లడి సందర్భంగా దేశ ఆర్థిక స్థితిగతులు, ద్రవ్యోల్బణ, వృద్ధి అవుట్‌లుక్‌పై గవర్నర్‌ వ్యాఖ్యలను పరిశీలించనున్నాయి.   

స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం
జూలైతో సహా ఈ ఏడాది తొలి ఆరునెలలకు సంబంధించి కేంద్రం జీఎస్‌టీ వసూళ్లను, ఆటో కంపెనీలు వాహన అమ్మక గణాంకాలు నేడు విడుదల చేయనున్నాయి. తయారీ రంగ పీఎంఐ నేడు, సేవారంగ గణాంకాలు (బుధవారం) మూడో తేదీన విడుదల అవుతాయి. వాణిజ్యలోటు డేటా మంగళవారం వెల్లడి కానుంది. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్‌బీఐ జూలై 29 వారంతో ముగిసిన ఫారెక్స్‌ నిల్వలను విడుదల చేయనుంది. దేశ ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ స్థూల గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించనున్నారు.

క్యూ1 ఆర్థిక ఫలితాలు
ఇప్పటికే ప్రధాన కంపెనీల తమ క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. అయితే ఈ వారంలో సుమారు 560కి పైగా కంపెనీలు తమ జూన్‌ త్రైమాసిక ఆర్థిక గణాంకాలను ప్రకటించనున్నాయి. ఐటీసీ, యూపీఎల్, బ్రిటానియా, గెయిల్, టైటాన్, ఎంఅండ్‌ఎం, వరణ్‌ బేవరీజెస్, జొమాటో, ఎస్కార్ట్స్, అదానీ గ్రీన్, సిమెన్స్, భాష్, గోద్రేజ్‌ ప్రాపర్టీస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పవర్, అదానీ విల్మర్, ఇండిగో, నైకా, పెట్రోనెట్‌ మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా సంబంధిత కంపెనీ షేర్లు ఒడిదుడులకు లోనయ్యే అవకాశం ఉంది. అలాగే యాజమాన్యం చేసే అవుట్‌లుక్‌ వ్యాఖ్యను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top