‘సెల్ఫిష్‌’ ఎలన్‌ మస్క్‌! అవకతవకలపై కోర్టుకెక్కిన షేర్‌హోల్డర్‌.. మిగతా వాళ్లది అదే మా(బా)ట

Elon Musk Could Face Billions Fine Over Solarcity Lawsuit - Sakshi

Elon Musk Solarcity Lawsuit: టెక్‌ మేధావి ఎలన్‌ మస్క్‌కి భారీ షాక్‌ తగలనుందా?. అదీ సొంత ప్రాజెక్టు సోలార్‌ సిటీ నుంచే!. అవుననే అంటున్నాయి కొన్ని మీడియా కథనాలు. సోలార్‌ సిటీ చైర్మన్‌ పదవిలో కొనసాగుతున్న మస్క్‌.. అందులో మేజర్‌ షేర్‌ హోల్డర్‌ కూడా. ఈ క్రమంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. తాజాగా ఓ ఇన్వెస్టర్‌ ఆయన మీద కోర్టుకు ఎక్కగా..  ఆ ఆరోపణలు రుజువైతే 9.4 బిలియన్‌ డాలర్ల భారీ జరిమానా మస్క్‌ చెల్లించాల్సి వస్తుందట!.   

బ్లూమరాంగ్‌ కథనం ప్రకారం..  సోలార్‌సిటీకి సంబంధించిన ఇన్వెస్టర్‌ ఒకరు మస్క్‌కు వ్యతిరేకంగా కాలిఫోర్నియా కోర్టులో దావా వేశారు.  షేర్‌ హోల్డర్స్‌ అభిప్రాయాలు, సమ్మతి తీసుకోకుండానే ఎలన్‌ మస్క్‌ సుమారు 2.6 బిలియన్‌ డాలర్ల డీల్‌ ఒకటి కుదుర్చుకున్నాడనేది ఇన్వెస్టర్‌ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు షేర్‌ హోల్డర్స్‌ ప్రాధాన్యం తగ్గిస్తూ.. లాభాలన్నీ తన ఖాతాలోనే వేసుకుంటున్నాడని, తన వరకు తనకు సంబంధించిన వాటా కోసం కోర్టును ఆశ్రయించినట్లు సదరు షేర్‌హోల్డర్‌ పేర్కొన్నాడు. ఇక ఈ దావాకు మిగతా షేర్‌ హోల్డర్స్‌లో కొందరు మద్దతు ప్రకటించడం విశేషం. ఒకవేళ ఆరోపణలు రుజువైతే మస్క్‌ 9.4 బిలియన్‌ డాలర్ల జరిమానా(మన కరెన్సీలో దాదాపు 70 వేల కోట్లదాకా) చెల్లించాల్సి వస్తుందని బ్లూమరాంగ్‌  పేర్కొంది. 

ఇంతకుముందు కూడా..
గతంలో సోలార్‌ సిటీలో మస్క్‌ స్టాక్‌ షేర్‌ 2.4 మిలియన్‌గా ఉండేది. అయితే స్టాక్స్‌ పంపకం తర్వాత ఇప్పుడది 12 మిలియన్‌కు చేరుకుంది. దీంతో మస్క్‌ షేర్‌ విలువ 9.56 బిలియన్‌ డాలర్లగా ఉంది.  ఇక టెస్లా సీఈవో హోదాలో ఉండి అన్నివ్యవహారాల్లో ఎలాగైతే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడో.. ఇటు సోలార్‌ సిటీ స్టాక్ హోల్డర్స్‌ను ఎలన్‌ మస్క్‌ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.  ఈ క్రమంలోనే 2017లో టెస్లా షేర్‌ హోల్డర్స్‌ అంతా కలిసి మస్క్‌ మీద దావా కూడా వేశారు.  కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహించడం, అధిక వాటాను లాగేసుకోవడం, సమర్థవంతులను పక్కకు తోసేయడం లాంటివి చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి మస్క్‌పై. అయితే మస్క్‌ సంపాదన తప్పుడు దోవలో లేదని,  85 శాతం షేర్‌ హోల్డర్స్‌ ఈ ఆర్జనను ఆమోదిస్తున్నారని మస్క్‌ తరపు న్యాయవాదులు చెప్తున్నారు.

చదవండి: చైనా బ్యాన్‌.. మస్క్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top