Elon Musk: ఎలాన్‌మస్క్‌ కొత్త ఎత్తుగడ.. ఈసారి ఏకంగా ఉద్యోగులతో..

Elon Musk to address Twitter employees - Sakshi

ట్విటర్‌ కొనుగోలు వ్యవహారం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. రూ. 44 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఈ డీల్‌లో పై చేయి సాధించేందుకు ఇటు ఎలాన్‌మస్క్‌ అటు బోర్డు సభ్యులు, షేర్‌ హోల్డర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. దీంతో గడిచిన రెండు నెలల్లో వరుసగా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరంపరంలో మరో ఎత్త ఐడియాతో ముందుకు వచ్చాడు ఎలాన్‌ మస్క్‌. 

భారీ డీల్‌
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌ ట్విటర్‌ పని తీరు బాగాలేదంటూ విమర్శలు ఎక్కుపెడుతూ ఆకస్మాత్తుగా 44 బిలియన్‌ డాలర్లకు ఏకమొత్తంగా ట్విటర్‌ కొనుగోలు చేస్తానంటూ 2022 ఏప్రిల్‌లో ప్రకటించారు. బోర్డు సభ్యులు, ఉద్యోగులు ఈ భారీ ఆఫర్‌కి వ్యతిరేకంగా గళం విప్పినా షేర్‌ హోల్డర్లు సానుకూలంగా ఉండటంతో డీల్‌ సెట్‌ అయ్యింది. 2020 ఆగస్టు నాటికి ఈ డీల్‌ పూర్తి కావాల్సి ఉంది.

ఎత్తులకు పైఎత్తులు
ట్విటర్‌లో ఫేక్‌ఖాతాల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ట్విటర్‌లో ఫేక్‌ ఖాలాలు 5 శాతం మించి ఉండవని ట్విటర్‌ ప్రకటించింది. కానీ 20 శాతం వరకు ఫేక్‌ ఖాతాలు ఉన్నాయంటూ.. ఫేక్‌ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే కొనుగోలు వ్యవహారం ముందుకు వెళ్లదంటూ ఎలాన్‌మస్క్‌ షాక్‌ ఇచ్చాడు. దీనికి ప్రతిగిగా అమ్మకం ప్రక్రియ ముందుకు జరగాలంటే ముందుగా బోర్డు సభ్యులతో ఓటింగ్‌ నిర్వహిస్తామని ఆ తర్వాతే డీల్‌ విషయంలో అడుగులు ముందుకు పడతాయంటూ ట్విటర్‌ తెలిపింది.

న్యూ ప్లాన్‌
ట్విటర్‌ నుంచి ఓటింగ్‌ ప్రతిపాదన వచ్చిన తర్వాత వారం రోజుల పాటు మస్క్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆ తర్వాత ఊహించని ప్రతిపాదనతో మస్క్‌ తెర మీదకు వచ్చారు. నేరుగా ట్విటర్‌ ఉద్యోగులతో మాట్లాడతానంటూ ప్రకటించారు. వారికి ఉన్న సందేహాలకు సమాధానం ఇస్తానమంటూ తెలిపారు. ఈ మేరకు 2022 జూన్‌ 16న ఉద్యోగులతో మస్క్‌ నేరుగా మాటామంతీ జరిపే వీలుంది.

ఈసారి అటు నుంచి
ప్రపంచంలోనే పెద్ద కంపెనీలకు ఫౌండర్‌గా, సీఈవోగా ఉన్న ఎలాన్‌మస్క్‌ వ్యవహారశైలి ఆది నుంచి వివాస్పదం. ముక్కుసూటిగా ముందుకు వెళ్తానంటూ మస్క్‌ చెప్పినా కార్పోరేట్‌ వరల్డ్‌ మస్క్‌ దూకుడుకు బెదిరిపోతుంది. ట్విటర్‌ డీల్‌ ప్రకటన వెలువడగానే కంపెనీ భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయం ట్విటర్‌ సీఈవో నుంచి ఉద్యోగుల వరకు వెంటాడింది. దీంతో ఇప్పటికే షేర్‌ హోల్డర్ల మద్దతు సాధించిన మస్క్‌ ఈ సారి ఉద్యోగుల అభిమానం చూరగొనేందుకు ప్రయత్నించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

చదవండి: యూట్యూబ్‌లో ‘ఎలన్‌ మస్క్‌ స్కామ్‌’, వందల కోట్లలో నష్టం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top