
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నగరాలలో వీకెండ్ అంటే సంథింగ్ స్పెషల్.. నిద్ర లేచే సమయం నుంచి తినే తిండి, తిరిగే ప్రాంతం వరకూ.. ప్రతీది డిఫరెంట్‌గా ఉండాలనుకుంటారు. కరోనా తర్వాత నుంచి ఈ అభిరుచికి పర్యావరణం కూడా తోడైంది. దీంతో వారంలో కనీసం రెండు రోజులైనా పచ్చని ప్రకృతిలో సేదతీరాలని భావిస్తున్నారు. చుట్టూ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, రణగొణ ధ్వనులు, కాలుష్యం లేని ప్రాంతం.. ఇంటికి తిరిగొస్తూ వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు వెంట తెచ్చుకునే వీలూ ఉండాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే వీకెండ్ హోమ్స్ ఆదరణ పెరిగింది.
ఈ ప్రాంతాల్లో డిమాండ్
కడ్తాల్, తలకొండపల్లి, షాద్‌నగర్, శంకర్‌పల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్ హోమ్స్‌కు డిమాండ్ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్ హోమ్స్ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు. కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే.. అందమైన వీకెండ్ హోమ్స్‌ను డిజైన్ చేయవచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువూ పర్యావరణ హితమైనవే ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కలపతో నిర్మాణం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఉంటుంది.
ఎక్కడ చూసినా గ్రీనరీనే..
వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్‌లలో సాధ్యమైనంత స్థలాన్ని గ్రీనరీకే కేటాయిస్తారు. ఒకవేళ వీకెండ్ హోమ్స్‌ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకు తీసుకుంటుంది. వాటిని డెస్టినేషన్ వెండింగ్స్ కోసం వినియోగించి.. వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా ఇస్తుంది. వాటి నిర్వహణ బాధ్యత కంపెనీదే. ఒకవేళ కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకునేందుకు వీలుగా తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తారు.