
మళ్లీ రూ. లక్ష పైకి జంప్
10 గ్రాములకు 2,200 ర్యాలీ
రూ.1,01,540 స్థాయి నమోదు
జీవితకాల గరిష్టానికి వెండి ధరలు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆజ్యం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు, పసిడి ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా పసిడి మరో సరికొత్త రికార్డు దిశగా పరుగులు తీసింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో ఒక దశలో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,200 పెరిగి రూ.1,01,540 స్థాయిని తాకింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.1,900 పెరిగి రూ.1,00,700 స్థాయిని నమోదు చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన పసిడి ధర (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,01,600 ఇప్పటివరకు దేశీ మార్కెట్లో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిగా కొనసాగుతోంది. దీని ప్రకారం సరికొత్త రికార్డుకు చేరువైనట్టు తెలుస్తోంది. అయితే అమ్మకాల ఒత్తిడితో ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు ఆ తర్వాత కొంత దిగొచ్చాయి. మరోవైపు వెండి సైతం కిలోకి రూ.1,100 పెరగడంతో సరికొత్త జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,08,100కు చేరుకుంది.
ఎంసీఎక్స్ మార్కెట్లో ఆగస్ట్ డెలివరీ కాంట్రాక్టు పసిడి ధర రూ.2,011 పెరిగి రూ.1,00,403కు చేరుకుంది. ‘‘బంగారం ధరలు రూ.లక్ష మార్క్‌ను దాటి కొత్త గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 3,440 డాలర్లను అధిగమించింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనం వైపు మొగ్గుచూపించారు’’అని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురి చేసినట్టు చెప్పారు.