 
													రూ. 41,900 కోట్ల మళ్లింపు
ఫలితంగా ఆరు కీలక లిస్టెడ్ కంపెనీలు కుదేలు
ఇన్వెస్టిగేటివ్ పోర్టల్ కోబ్రాపోస్ట్ సంచలన ఆరోపణలు
విషప్రచారం చేస్తున్నారంటూ అడాగ్ ఖండన
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ (అడాగ్) వేల కోట్ల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఇన్వెస్టిగేటివ్ పోర్టల్ కోబ్రాపోస్ట్ సంచలన ఆరోపణలు చేసింది. 2006 నుంచి గ్రూప్ కంపెనీల ద్వారా రూ. 41,921 కోట్ల నిధులు మళ్లించినట్లు ఓ నివేదికలో తెలిపింది. అయితే, తమ గ్రూప్ సంస్థల షేర్ల ధరలను కుదేలు చేయడానికి జరుగుతున్న విషప్రచారంగా అడాగ్ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.
వివరాల్లోకి వెళ్తే .. రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తదితర లిస్టెడ్ గ్రూప్ సంస్థలు బ్యాంక్ రుణాలు, ఐపీవోలు, బాండ్లు తదితర రూపాల్లో సమీకరించిన రూ. 28,874 కోట్లను ప్రమోటర్‌కి చెందిన కంపెనీలకు మళ్లించినట్లు కోబ్రాపోస్ట్ పేర్కొంది.
అలాగే అనుబంధ సంస్థలు, డొల్ల కంపెనీల నెట్‌వర్క్ ద్వారా సింగపూర్, మారిషస్, సైప్రస్, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల నుంచి 1.535 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 13,047 కోట్లు) మోసపూరిత విధానాలతో భారత్‌లోకి మళ్లించినట్లు వివరించింది.  ‘బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్, సైప్రస్, మారిషస్ మొదలైన దేశాలకు చెందిన డజన్ల కొద్దీ సంస్థలు, సబ్సిడరీలు, డొల్ల కంపెనీల్లాంటి వాటి ద్వారా రూ. 41,921 కోట్ల పైగా నిధుల మళ్లింపు జరిగింది‘ అని కోబ్రాపోస్ట్ తెలిపింది. ఈ పరిణామాలతో ఆరు కీలకమైన లిస్టెడ్ కంపెనీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని పేర్కొంది.  
సింగపూర్ కనెక్షన్.. 
సింగపూర్‌కి చెందిన ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ట్రేడింగ్‌కి నెక్స్‌జెన్ క్యాపిటల్ అనే ఒక ’రహస్యమయ లబ్దిదారు’ నుంచి 750 మిలియన్ డాలర్లు లభించగా, అటు తర్వాత ఎమర్జింగ్ మార్కెట్ సంస్థను మూసివేయడానికి ముందు ఆ నిధులు రిలయన్స్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన రిలయన్స్ ఇన్నోవెంచర్స్‌కి బదిలీ అయ్యాయని కోబ్రాపోస్ట్ వెల్లడించింది. ఇది ’మనీ లాండరింగ్’ లావాదేవీ అయి ఉండొచ్చని పేర్కొంది. 
కంపెనీల చట్టం, ఫెమా, పీఎంఎల్‌ఏ, సెబీ చట్టం, ఆదాయ పన్ను చట్టం మొదలైన వాటిని ఉల్లంఘిస్తూ అనేక లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ, సెబీ, ఎన్‌సీఎల్‌టీ, ఆర్‌బీఐ మొదలైన వాటి దగ్గరున్న ఫైలింగ్స్, ఆదేశాల్లో ఉన్న వివరాల ఆధారంగా ఈ విషయాలు తమ విచారణలో వెల్లడైనట్లు కోబ్రాపోస్ట్ ఎడిటర్ అనిరుద్ధ బెహల్ తెలిపారు. వీటి వల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్, మొండిబాకీలు మొదలైన రూపాల్లో మొత్తం రూ. 3.38 లక్షల కోట్ల ప్రజా సంపద పోయిందని ఆయన ఆరోపించారు.
తోసిపుచ్చిన అడాగ్.. 
కోబ్రాపోస్ట్ నివేదికలో ఆరోపణలను అడాగ్ కొట్టిపారేసింది. గ్రూప్ అసెట్స్‌ను దక్కించుకోవాలనే దురాలోచన గల సంస్థలు.. ఎప్పుడో పాతబడిన, బహిరంగంగా ఉన్న, సీబీఐ.. ఈడీ తదితర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పరిశీలించిన సమాచారాన్ని తిరగతోడి ఈ ఆరోపణలు చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఇది తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, సంబంధిత భాగస్వాములను తప్పుదారి పట్టించేందుకు జరుగుతున్న విషప్రచారమని పేర్కొంది. 
కోబ్రాపోస్ట్‌కి నిర్దిష్ట ఎజెండాను పెట్టుకుని స్టింగ్ ఆపరేషన్ చేస్తుందనే ట్రాక్ రికార్డు ఉందని అడాగ్ తెలిపింది. ‘రిలయన్స్ గ్రూప్, అనిల్ అంబానీ, 55 లక్షల మంది వాటాదారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు, స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ గ్రూప్ సంస్థల షేర్లను కుదేలు చేసి, ఆయా కంపెనీలను దక్కించుకునేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారం ఇది‘ అని అడాగ్ వ్యాఖ్యానించింది. అటు గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ పవర్ ఇటీవల తమ షేర్ల ట్రేడింగ్ ధోరణుల్లో మార్పులు చోటు చేసుకోవడంపై విచారణ జరపాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిర్యాదులు చేశాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
