‘ఫండ్స్‌’ను బహుమతిగా ఇవ్వొచ్చా..? | Can we gift mutual funds in India? Know the conditions | Sakshi
Sakshi News home page

‘ఫండ్స్‌’ను బహుమతిగా ఇవ్వొచ్చా..?

Jun 16 2025 8:44 AM | Updated on Jun 16 2025 10:14 AM

Can we gift mutual funds in India? Know the conditions

ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయా..? – వివేక్‌  

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాలు పాత పన్ను విధానంలో సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను ఆదా ప్రయోజనం కలిగినవవి. ఈ పథకాల్లో రాబడులు దీర్ఘకాలంలో సగటున 15–20% మధ్య ఉంటాయి. ఈ విభాగంలో బలహీన పనితీరు చూపించిన పథకాన్ని గమనించినా.. పీపీఎఫ్‌ కంటే అధిక రాబడులు కనిపిస్తాయి. కాంపౌండింగ్‌ (వడ్డీపై వడ్డీ జమ కావడం) ప్రయోజనంతో పెట్టుబడి వృద్ధి చెందుతుంది.

మంచి పథకాన్ని ఎంపిక చేసుకుని, అది అన్ని కాలాల్లోనూ మంచి పనితీరు చూపిస్తుంటే దానితోనే కొనసాగొచ్చు. మార్కెట్‌తో అనుసంధానమైన సాధనాల్లో పెట్టుబడులు ఆటుపోట్లకు గురువుతుంటాయి. కనుక వాటి పనితీరును కాలానుగుణంగా పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే కొంత కాలం పాటు మంచి పనితీరు చూపించినవి, ఆ తర్వాత చెత్త పథకాలుగా మారొచ్చు. అందుకే పెట్టుబడులను సమీక్షించుకోవడమనే సూత్రాన్ని అనుసరించాలి. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకం పనితీరు ఆశాజనకంగా లేకపోతే, దాని నుంచి మూడేళ్ల తర్వాత బయటకు వచ్చేయవచ్చు. ఎందుకంటే మూడేళ్లకు పెట్టుబడుల లాకిన్‌ ముగిసిపోతుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మారిపోయి ఉంటే అలాంటి వారు ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ బదులు రిస్క్, కాల వ్యవధి, రాబడుల అంచనాలకు అనుగుణంగా ఫ్లెక్సీక్యాప్, డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ తదితర పథకాలను పరిశీలించొచ్చు.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో నా పెట్టుబడులను మరొకరికి బహుమతిగా ఇవ్వడం ఎలా? – నీరజ్‌ ప్రసాద్‌

మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్‌ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్‌ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్‌ దాఖలు చేసుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలన్నా కుదరదు. పిల్లల కోసం అయితే వారి పేరుతో ఇన్వెస్ట్‌ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది.

ఇదీ చదవండి: ఇండియాలో స్టార్‌లింక్‌ సేవలకు డేట్‌ఫిక్స్‌?

పిల్లలు మేజర్‌ అయ్యే వరకు (18 ఏళ్లు నిండే వరకు) తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులకు సంరక్షకులు అధికారం కలిగి ఉంటారు. పిల్లల బర్త్‌ సర్టిఫికెట్‌తోపాటు, గార్డియన్‌ కేవైసీ వివరాలను మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. పిల్లలు కాకుండా వేరొకరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు ఇవ్వాలనుకుంటే ముందుగా వాటిని విక్రయించాలి. అలా వచ్చిన నగదును బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి బదిలీ చేయాలి. అప్పుడు మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Advertisement
 
Advertisement
Advertisement