
హైదరాబాద్: నకిలీ ఐఎస్ఐ ముద్రలతో ఉత్పత్తులు తయారు చేస్తున్న ఓ పరిశ్రమపై భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS), హైదరాబాద్ శాఖా కార్యాలయ అధికారులు దాడులు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఓ పరిశ్రమలో నకిలీ ఐఎస్ఐ ముద్రలతో ఇంటి తలుపులకు వాడే స్టీల్ హింజ్స్ను తయారుచేస్తూ, మార్కెట్కు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఉత్పత్తులతో పాటు నకిలీ ఐఎస్ఐ ముద్రించిన ప్యాకేజింగ్ లేబుల్ అట్టలనూ సీజ్ చేసినట్లూ బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ తెలిపారు.
IS 1341:2018 ప్రమాణానికి లోబడి స్టీల్ బట్ హింజ్స్ను తయారు చేయాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం ఈ ఉత్పత్తికి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ గెజిట్ ద్వారా బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. దీన్ని తయారు చేసేందుకు కచ్చితంగా బీఐఎస్ నుంచి ధ్రువీకరణ పొందడంతో పాటు మార్కెట్లో నిల్వ చేయాలన్నా, విక్రయించాలన్నా దానిపై ఐఎస్ఐ ముద్రతో పాటు తయారీదారు లైసెన్సు వివరాలు ముద్రించాల్సి ఉంటుంది. కానీ, ఈ ఫ్యాక్టరీలో ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే ఐఎస్ఐ మార్కును అనధికారికంగా వినియోగిస్తున్నట్లు బీఐఎస్ అధికారులు గుర్తించారు. బీఐఎస్ డైరెక్టర్ తమ్మాడి సుజాత, జాయింట్ డైరెక్టర్ తన్నీరు రాకేశ్ నేతృత్వంలోని బృందం దాడుల్లో పాల్గొంది.
బీఐఎస్ చట్టం 2016 ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడుతున్నామని పీవీ శ్రీకాంత్ తెలిపారు. తప్పనిసరి జాబితాలో ఉన్న ఏ ఉత్పత్తిని అయినా బీఐఎస్ ధ్రువీకరణ లేకుండా తయారుచేసినా, నిల్వ చేసినా, విక్రయించినా చర్యలుంటాయన్నారు. దీనికి రూ.లక్ష నుంచి రూ.5లక్షల దాకా జరిమానాతో పాటు ఏడాది నుంచి 5ఏళ్ల దాకా జైలు శిక్షా పడే అవకాశముందన్నారు.
వినియోగదారులు కొనే ప్రతీ వస్తువునూ బీఐఎస్ కేర్ యాప్లో నాణ్యత పరీక్షించుకొని కొనాలని.. నకిలీ నాణ్యతా చిహ్నాల పట్లా ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ప్రతీ ఐఎస్ఐ మార్కు పైన ఆ వస్తువు యొక్క ఐఎస్(ఇండియన్ స్టాండర్డ్) నెంబరు, కింద ఆ తయారీదారు లైసెన్సు నెంబరు కచ్చితంగా ఉండాలన్నారు. ఆ లైసెన్సు నెంబరును బీఐఎస్ కేర్ యాప్లో నమోదు చేసి వస్తువు యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. బంగారు ఆభరణాలకైతే హెచ్యూఐడీ తప్పనిసరి ఉండాలని.. దాని ద్వారా ఆ ఆభరణం శుద్ధతనూ ఇదే యాప్లో తెలుసుకోవచ్చన్నారు. ఇదే ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షించేందుకూ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ బీఐఎస్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ఉల్లంఘనలు మీ దృష్టికి వచ్చినా బీఐఎస్ కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఇతర వివరాలకు హైదరాబాద్ శాఖా కార్యాలయాన్ని +91 9154843230/31 నెంబర్లను సంప్రదించాలన్నారు.