
ఐదు నెలలు ఆశాజనకం.. సెప్టెంబర్‌లో 5 శాతం తగ్గిన ఆదాయం
2024 సెప్టెంబర్‌లో 5,267 కోట్లు.. 2025 సెప్టెంబర్‌లో రూ.4,998 కోట్లు
దేశవ్యాప్తంగా రాబడులు పెరిగినా రాష్ట్రంలో లోటు
సాక్షి, హైదరాబాద్: ఐదు నెలలుగా జోరు మీద ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు కళ్లెం పడింది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 సెప్టెంబర్‌లో తెలంగాణ జీఎస్టీ రాబడులు రూ.4,998 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5వేల కోట్లకు తక్కువగా జీఎస్టీ ఆదాయం నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చినా ఇది తక్కువే. 2024 సెప్టెంబర్‌లో రూ.5,267 కోట్లు జీఎస్టీ ఆదాయం రాగా, ఈసారి అంతకంటే రూ.269 కోట్లు (5 శాతం) తక్కువగా వచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దేశమంతా రాబడులు పెరిగినా తెలంగాణలో తక్కువగా రావడం గమనార్హం. దేశంలో రెండు, మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీఎస్టీ ఆదాయం పడిపోయింది. మణిపూర్ (1 శాతం), ఢిల్లీ (1 శాతం), హిమా చల్‌ప్రదేశ్ (4శాతం)లో రాబడులు తగ్గాయి. మధ్య ప్రదేశ్‌లో 21 శాతం, బిహార్‌లో 17, ఉత్తరప్రదేశ్‌లో 11, రాజస్తాన్‌లో 10 శాతం మేర జీఎస్టీ పెరిగింది. దక్షిణాది విషయానికొస్తే కేరళలో 13 శాతం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో (4 శాతం), కర్ణాటకలో 7 శాతం జీఎస్టీ పెరిగింది. కానీ, తెలంగాణలో మాత్రం గత సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో తక్కువ ఆదాయం వచ్చింది
ఆగస్టు వరకూ పైపైకే...:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ మినహాయిస్తే మిగిలిన ఐదు నెలల జీఎస్టీ రాబడులు రాష్ట్రంలో ఆశాజనకంగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వరుసగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో చూస్తే మాత్రం ప్రతి నెలా (ఒక్క జూలై మినహా) తగ్గుతూనే ఉన్నాయి. 2025లో ఏప్రిల్‌లో అత్యధికంగా రూ. 6,983 కోట్లు వచ్చిన జీఎస్టీ రాబడులు ఆ తర్వాతి నెలలో రూ.5,310 కోట్లకు పడిపోయాయి. జూన్‌లోనూ అంతకంటే తక్కువగా నమోదు కాగా, జూలైలో మాత్రం రూ.300 కోట్ల పెరుగుదల కనిపించింది. ఇక, ఆగస్టు, సెప్టెంబర్‌లో మళ్లీ తగ్గుదలే నమోదైంది.
కారణాలేంటి?
దేశవ్యాప్తంగా జీఎస్టీ రాబడులు పెరగ్గా.. రాష్ట్రంలో మాత్రం తగ్గేందుకు కారణాలేంటన్న దానిపై వాణిజ్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, జీఎస్టీ అధికారులు మాత్రం ఇందుకు చెప్పుకోదగిన కారణాలేవీ లేవని, సాంకేతిక కారణాలతోనే అలా జరిగి ఉంటుందని అంటున్నారు. ఈ తగ్గుదల యాదృచ్ఛికమేనని చెబుతున్నారు. తెలంగాణలో లగ్జరీ వస్తువుల వినియోగం ఎక్కువగా ఉంటుందని, సెప్టెంబర్ రిటర్న్స్ వచ్చే నెలలో ఆ వస్తువుల కొనుగోళ్లు తగ్గి ఉండటం, కేంద్రం నుంచి వచ్చిన పాత బకాయిలు, పరిహారం లాంటివి ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా వచ్చి ఉండొచ్చని, లేదంటే ఆయా రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో వచ్చిన డిమాండ్ ఈనెలలో కార్యరూపం దాల్చి ఉంటుందని అంటున్నారు. అంతేతప్ప జీఎస్టీ రాబడుల్లో తెలంగాణలో ప్రత్యేక తగ్గుదల లేదని వారు చెబుతుండటం గమనార్హం.