బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 2 రోజులు బ్యాంక్‌ యూనియన్ల సమ్మె!

Bank unions to stage nationwide strike against proposed privatization - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ డిసెంబర్‌ 16, 17 తేదీల్లో సమ్మెకు దిగుతామని బ్యాంక్‌ యూనియన్లు నోటీసులు ఇచ్చాయి. రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం సమాయత్తం అయిన నేపథ్యంలో బ్యాంకులు ఈ రెండు రోజుల సమ్మె బాట పట్టాయి. పలు వర్గాల నుంచి  ఆందోళనలు వ్యక్తం అయినప్పటికీ,   2019లో బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీకి మెజారీటీ వాటా విక్రయం ద్వారా ఐడీబీఐని కేంద్రం ఇప్పటికే ప్రైవేటీకరించింది.

గడచిన నాలుగు సంవత్సరాల్లో 14 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియను కూడా కేంద్రం విజయవంతంగా పూర్తిచేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ వాటాలను 26 శాతానికి తగ్గించుకోడానికి వెసులు బాటు కల్పించడానికి ఉద్దేశించి బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి వీలుగా బ్యాంకింగ్‌ చట్ట (సవరణ) బిల్లును కేంద్రం లిస్ట్‌ చేసింది. ఆయా చర్యలను నిరసిస్తూ, రెండు రోజుల సమ్మె నిర్వహించాలని బ్యాంకింగ్‌ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ (ఐబీఏ)కు యూఎఫ్‌బీయూ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top