డైవర్సిఫైడ్ ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 8 శాతం వృద్ధితో రూ. 2,244 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,087 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 33,704 కోట్ల నుంచి రూ. 37,403 కోట్లకు ఎగసింది.
వడ్డీ ఆదాయం రూ. 16,572 కోట్ల నుంచి రూ. 19,599 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 27,741 కోట్ల నుంచి రూ. 30,581 కోట్లకు పెరిగాయి. అనుబంధ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ లాభం 5 శాతం పుంజుకుని రూ. 517 కోట్లకు చేరగా.. అసెట్ మేనేజ్‌మెంట్ ఏయూఎం రూ. 28,814 కోట్లను తాకింది.
జాగిల్ లాభం జూమ్
స్పెండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ జాగిల్ (zaggle) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 79 శాతం జంప్‌చేసి రూ. 33 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 42 శాతంపైగా ఎగసి రూ. 431 కోట్లను తాకింది.
నిర్వహణ లాభం(ఇబిటా) 48% వృద్ధితో రూ. 44 కోట్లకు చేరింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో కలసి రిటైల్ కార్డుల విభాగంలోకి ప్రవేశించినట్లు కంపెనీ వెల్లడించింది. జాగిల్ గ్లోబల్‌ప్లే ఫారెక్స్ కార్డ్‌తోపాటు జాగిల్ మాస్టర్ కార్డ్ ప్రిపెయిడ్ కార్డ్‌లను ప్రవేశపెట్టినట్లు తెలియజేసింది.


