
చైనాకు చెందిన సీఏఎల్‌బీతో జట్టు
భారత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసే దిశగా వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ పెట్టుబడుల పెడుతోంది. వచ్చే 7 నుంచి 10 ఏళ్లలో తదుపరి తరం బ్యాటరీల అభివృద్ధి, తయారీ కోసం రూ.5,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
హిందూజా గ్రూప్ యాజమాన్యంలోని ఈ సంస్థ చైనా బ్యాటరీ టెక్నాలజీ లీడర్ సీఏఎల్‌బీ గ్రూప్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, భారత్‌లో బలమైన బ్యాటరీ సరఫరా గొలుసును నిర్మించడం లక్ష్యంగా ఈ సహకారం కుదిరినట్లు ఇరు వర్గాలు తెలిపాయి.
ఆటోమోటివ్, ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్‌లు..
ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (ఈఎస్ఎస్)తో సహా ఆటోమోటివ్, నాన్ ఆటోమోటివ్ అప్లికేషన్‌లలో ఈ పెట్టుబడులు విస్తరించనున్నాయి. అశోక్ లేలాండ్ బ్యాటరీ ఉత్పత్తి విభాగంలోకి ప్రవేశించడంతో సొంత వాణిజ్య వాహన వ్యాపారానికి మద్దతుగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని వేగవంతం చేయడానికి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశంలో బ్యాటరీ సరఫరా గొలుసును సృష్టించే దిశగా సీఏఎల్‌బీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక కీలక అడుగు అని అశోక్ లేలాండ్ ఛైర్మన్ ధీరజ్ హిందూజా అన్నారు.
అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ షెను అగర్వాల్ మాట్లాడుతూ.. ‘బ్యాటరీ వ్యాపారంలో ప్రాథమికంగా ఆటోమోటివ్ అప్లికేషన్లపై దృష్టి సారిస్తాం. తరువాత పారిశ్రామిక, నివాస ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాలతో సహా నాన్-ఆటోమోటివ్ రంగాలకు ప్రణాళికాబద్ధంగా విస్తరిస్తాం’ అన్నారు.
ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే..