
జూన్ త్రైమాసికంలో అంచనాలను మించి 7.8 శాతం వృద్ధి
ఐదు త్రైమాసికాల గరిష్ట స్థాయి ∙వ్యవసాయం, సేవల రంగాల పటిష్ట పనితీరు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు అంచనాలను మించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.8 శాతం వృద్ధి సాధించింది. ఇది 5 త్రైమాసికాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. 2024 జనవరి–మార్చి క్వార్టర్‌లో వృద్ధి రేటు 8.4 శాతం తర్వాత మళ్లీ గరిష్ట స్థాయి ఇదే. ఆర్‌బీఐ అంచనా అయిన 6.5 శాతం మించి వృద్ధి నమోదైంది.
వ్యవసాయం, తయారీ రంగాలు బలంగా రాణించడం ఇందుకు దోహదం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ1లో జీడీపీ 6.5% వృద్ధి చెందగా, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 7.4% వృద్ధి నమోదైంది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ఈ వివరాలను విడుదల చేసింది. ‘2025–26 క్యూ1లో స్థిరమైన ధరల ఆధారంగా అసలైన జీడీపీ (జీవీఏ) రూ.47.89 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. 2024–25 క్యూ1లో ఇది రూ.44.42 లక్షల కోట్లుగా ఉంది. అంటే 7.8% వృద్ధికి సమానం’ అని ఎన్‌ఎస్‌వో తెలిపింది.
ఆదుకున్న సాగు, సేవలు..
→ ముఖ్యంగా వ్యవసాయ రంగం రాణించింది. 3.7 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ రంగంలో వృద్ధి 1.5 శాతమే.
→ తయారీ, నిర్మాణ రంగంలో వృద్ధి 7.7%కి పెరిగింది. గత క్యూ1లో ఇది 7.6%.
→ సేవల రంగం 9.3 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది 6.8 శాతంగా ఉంది. సేవల విభాగంలో వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవలకు సంబంధించి వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన 5.4 శాతం నుంచి 8.6 శాతానికి పెరిగింది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, వృత్తి సేవలకు సంబంధించి వృద్ధి రేటు 6.6% నుంచి 9.5 శాతానికి పెరిగింది.
→ ముఖ్యంగా మైనింగ్ రంగంలో పనితీరు బలహీనపడింది. ఈ రంగంలో వృద్ధి మైనస్ 3.1%గా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో మైనింగ్ రంగం 6.6 శాతం వృద్ధి చెందింది.
→ ఎగుమతుల వృద్ధి సైతం 6.3 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో 8.3 శాతం పెరగడం గమనార్హం.
→ జూన్ త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి 5.2 శాతంగా ఉంది. దీంతో ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని భారత్ నిలబెట్టుకుంది.
2025–26 జీడీపీ అంచనాల్లో మార్పు లేదు..
అమెరికా ప్రతీకార, పెనాల్టీ సుంకాలు విధించినప్పటికీ, క్యూ1లో బలమైన పనితీరు నమోదైన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.3–6.8 శాతం మధ్య ఉంటుందన్న మా అంచనాలను యథావిధిగా కొనసాగిస్తున్నాం.
– వి.అనంత నాగేశ్వరన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు