
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గ్లోబల్ సంస్థ యాపిల్ హైదరాబాద్ నగరంలో తన ఉనికిని, సేవలను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా నగరంలోని ఐటీ పార్క్ వేవ్‌రాక్‌లో నూతనంగా 64,125 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ విస్తరణతో సంస్థ మొత్తంగా 5 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.
అయితే వేవ్‌రాక్ టవర్‌లో యాపిల్ 64,125 చదరపు అడుగుల అదనపు కార్యాలయ స్థలానికి రూ.80.15 లక్షల నెలవారీ అద్దె చెల్లించేలా ఐదేళ్లకు లీజ్‌కు తీసుకున్నట్లు సమాచారం. ఇందుకుగాను చదరపు అడుగుకు రూ.125 చొప్పున చెల్లించనుంది. హైదరాబాద్‌లోని టీఎస్‌ఐ బిజినెస్ పార్క్స్ లిమిటెడ్ ద్వారా ప్రాజెక్ట్‌లో ఉన్న యాపిల్ ప్రస్తుత కార్యాలయాలను విస్తరించింది. ప్రాప్‌స్టాక్ ప్రకారం., యాపిల్ కంపెనీ ఈ ప్రాజెక్ట్‌లో అనేక కార్యాలయ స్థలాలను మల్టీ లీజ్‌లో భాగంగా మొత్తం 5 లక్షల చదరపు అడుగుల తీసుకుంది.
అద్దె ప్రారంభ తేదీ నుండి లీజుకు మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది . ఈ సమయంలో, ఒప్పందంలో పేర్కొన్న నిర్దిష్ట షరతుల కింద తప్ప, ఏ పక్షమూ లీజును రద్దు చేయలేరు. 2016 మేలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ అధికారికంగా హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించారు. జియోస్పేషియల్ టెక్నాలజీ, డేటా మోడలింగ్‌లో ప్రత్యేకత కలిగిన యాపిల్ మ్యాప్స్‌కు ఇది కీలకమైన అభివృద్ధి కేంద్రంగా పనిచేస్తుంది.
ఇదీ చదవండి: ఒక్కో కంపెనీ నెలకు ఎన్ని కోట్లు కడుతున్నాయో తెలుసా?