2025లో కూడా అనేక దిగ్గజ సంస్థలు.. తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. తాజాగా అమెజాన్.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14,000 కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ సంఖ్య 30,000 వరకు చేరే అవకాశం ఉందని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఇది సంస్థలో పనిచేసే ఉద్యోగులలో భయాన్ని కలిగిస్తోందని.. ఒక రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు.
నా దగ్గరి స్నేహితుల్లో ఒకరు అమెజాన్‌లో పనిచేస్తున్నారు. అతడు మంచి ప్రతిభావంతుడు. ఇతరులు సరిగ్గా పదాలను కూడా చెప్పలేని ఎన్నో సాంకేతిక సమస్యలను పరిష్కరించే వ్యక్తి. కానీ లేఆఫ్స్ వార్తలు అతనిని భయాందోళనకు గురి చేసిందని రెడ్డిట్ యూజర్ వెల్లడించారు.
తన ఫోనుకు నోటిఫికేషన్ వచ్చినా.. కాల్ వచ్చినా ఎక్కువ ఆందోళనకు గురవుతున్నాడు. ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఈమెయిల్ వస్తుందేమో అని భయంతో బిక్కుబిక్కుమంటున్నాడు. అతడు రాత్రి 2-3 గంటలు మాత్రమే నిద్రపోతాడు. ఇప్పటికే ఉద్యోగం కోల్పోయిన వారు రాత్రి సమయంలోనే.. లేఆఫ్ మెయిల్ పొందడంతో అతడు నిద్రపోవడానికి కూడా భయపడుతున్నాడు.

నాకు ఖచ్చితంగా లేఆఫ్ మెయిల్ వస్తుందని చెబుతున్నాడు. దీనికి కారణం తక్కువ మాట్లాడటమే. నేను పని చేస్తాను.. కానీ ఎవరితో ఎక్కువగా మాట్లాడను. ఒకసారి మేనేజర్ తనను పిలిచి.. కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయని, వాటిని పెంచుకోవాలని చెప్పినట్లు పేర్కొన్నాడు. పనిలో గొప్పగా రాణిస్తున్న వ్యక్తి.. ఉద్యోగం పోతుందేమో అని భయపడటం చాలా బాధగా ఉందని రెడ్దిట్ యూజర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: యూట్యూబ్ ఉద్యోగులకు ఎగ్జిట్ ప్లాన్
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ''నాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.. భయాందోళనలు, తినలేకపోవడం, మెసేజ్ కోసం చూడటం, గుండె వేగంగా కొట్టుకోవడం అన్నీ నిజమే'' అని యూజర్ పేర్కొన్నారు. ''మా కంపెనీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే.. 50శాతం మంది ఉద్యోగులను తొలగించిందని, ఆ సమయంలో చాలాకాలం నేను భయపడుతూనే ఉన్నానని'' మరొక యూజర్ పేర్కొన్నారు.
అమెజాన్ లేఆఫ్స్
అమెజాన్ కంపెనీ తమ మొత్తం కార్పొరేట్ ఉద్యోగులలో 10 శాతం తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించడంలో భాగంగానే.. సంస్థ ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. హెచ్ఆర్ విభాగంలో సుమారు 15 శాతం తగ్గించనున్నారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరగడం వల్ల.. మరిన్ని ఉద్యోగాల కోతలకు దారితీసే అవకాశం ఉందని జూన్‌లో సంస్థ సీఈఓ ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 15.5 లక్షలు.


