దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు, సైనిక దివ్యాంగుల పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ టాటా గ్రూప్ యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ వితంతువులు(వీర నారీ-యుద్ధంలో భర్తలను కోల్పోయినవారు), వారి పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్మీ ప్రత్యేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా భారత సైన్యంతో ఎయిరిండియా సహకార ఒప్పందం కుదుర్చుకుంది. దేశ నిర్మాణంలో, సామాజిక బాధ్యతలో కార్పొరేట్ రంగానికి ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
తొలి విడతగా 60 మందికి అవకాశం
ఈ వినూత్న భాగస్వామ్యం ద్వారా వీర నారీలు, వారి పిల్లలకు ‘ఎయిరిండియా శాట్స్ ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ (ఏఐ సాట్స్)లో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమం కింద ప్రాథమికంగా 20 మంది యుద్ధ వితంతువులను, 40 మంది వారి పిల్లలను ఎయిర్‌లైన్స్ ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు. వీరికి విమానాశ్రయ కార్యకలాపాల్లో కీలకమైన కస్టమర్ సేవలు, లోడ్ అండ్ కంట్రోల్, ర్యాంప్ ఆపరేషన్స్ విభాగాల్లో బాధ్యతలు అప్పగిస్తారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వీరికి శిక్షణ అందిస్తారు. తద్వారా దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక సాధికారతను పెంపొందిస్తూ ఉద్యోగానికి తక్షణమే సిద్ధమయ్యేలా అభ్యర్థులను తీర్చిదిద్దుతారు.
‘ఆశా’ పాఠశాలల్లో వృత్తి విద్యా ల్యాబ్‌ల ఏర్పాటు
కంటోన్మెంట్ ప్రాంతాల్లో నివసిస్తున్న సైనికులు, పూర్వ సైనికోద్యోగులు (అనుభవజ్ఞులు), దివ్యాంగుల పిల్లల సంక్షేమం కోసం భారత సైన్యం ప్రత్యేకంగా ‘ఆశా’ (ఆర్మీ స్పెషల్ హెల్ప్ అండ్ అసోసియేషన్) పాఠశాలలను నిర్వహిస్తోంది. ఈ చిన్నారులకు నాణ్యమైన విద్యా వైద్యంతో పాటు దీర్ఘకాలిక భవిష్యత్తును అందించేందుకు ఎయిరిండియా వృత్తి శిక్షణా మౌలిక సదుపాయాలను నిర్మించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 25 ఆశా పాఠశాలల్లో అత్యాధునిక వృత్తి శిక్షణా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడమే ఈ చొరవ ముఖ్య లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే 10 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభం కాగా, త్వరలోనే మిగిలిన 15 పాఠశాలలకు కూడా దీనిని విస్తరించనున్నారు.
వైవిధ్యమైన రంగాలలో శిక్షణ
చిన్నారుల సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసేలా ఈ ల్యాబ్‌ల్లో విభిన్న విభాగాలపై అనుభవపూర్వక శిక్షణ ఇవ్వనున్నారు. అందులో భాగంలో ఫోటోగ్రఫి, విజువల్ స్టోరీ టెల్లింగ్, మ్యూజిక్, పెయింటింగ్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, కుకింగ్, హాస్పిటాలిటీ, బ్యూటీ అండ్ వెల్నెస్, బోటిక్ అండ్ టైలరింగ్, ఎలక్ట్రికల్, ఇతర సాంకేతిక నైపుణ్యాలు, క్రీడల్లో శిక్షణ ఇస్తారు.
భారత సైన్యంతో కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఎయిరిండియా గవర్నెన్స్, రిస్క్, కంప్లయన్స్, కార్పొరేట్ వ్యవహారాల గ్రూప్ హెడ్ పి.బాలాజీ మాట్లాడుతూ ‘భారత సైన్యంతో ఎయిరిండియా భాగస్వామ్యం కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు; ఇది దేశ నిర్మాణ ప్రయత్నంలో భాగం కావాలనే మా ఉమ్మడి సంకల్పానికి ప్రతిరూపం. నైపుణ్యాలను బలోపేతం చేయడం, సరైన అవకాశాల ద్వారా సమాజంలో గౌరవాన్ని, సాధికారతను పెంపొందించడమే ఈ రెండు కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. సైన్యంతో కలిసి పనిచేస్తూ భవిష్యత్తులో స్థిరమైన, సానుకూల ప్రభావాన్ని చూపే ఒక స్కేలబుల్ మోడల్‌ను రూపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అన్నారు.
ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు


