
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాలా రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, తద్వారా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువవుతుంది పలువురు నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా లూయిస్‌విల్లే యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ 'రోమన్ యాంపోల్స్కీ' (Roman Yampolskiy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
రోమన్ యాంపోల్స్కీ ప్రకారం.. కృత్రిమ మేధస్సు (AI) 2030 నాటికి 99 శాతం మంది కార్మికులను నిరుద్యోగులుగా చేస్తుందని అన్నారు. ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి.. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏఐ వ్యవస్థలనే ఉపయోగించుకుంటారని హెచ్చరించారు.
కోడింగ్ ఉద్యోగులు, ప్రాంప్ట్ ఇంజనీర్లు మాత్రమే కాకుండా.. చాలా రంగాల్లోని ఉద్యోగాలని ఏఐ భర్తీ చేస్తుంది. మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో నిరుద్యోగం ఉన్న ప్రపంచాన్ని చూడబోతున్నాము. నేను 10 శాతం నిరుద్యోగం గురించి చెప్పడం లేదు. 99 శాతం ఉద్యోగాలు కోల్పోతారని చెబుతున్నానని ప్రొఫెసర్.. ది డైరీ ఆఫ్ ఎ సిఇఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు. 2027 నాటికి 'ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్' (ఏజీఐ) వచ్చే అవకాశం ఉందని అన్నారు.
ఇదీ చదవండి: అమెరికాతో కలిసి పనిచేయాలి: అశ్విని వైష్ణవ్
ఏజీఐ వచ్చిన మూడేళ్ళ తరువాత.. ఏఐ సాధనాలు, హ్యుమానాయిడ్ రోబోలు వస్తాయి. కంపెనీలు మనుషులకు ప్రత్యామ్నాయంగా వీటిని నియమించుకునే అవకాశం ఉందని అన్నారు. దీనివల్ల కార్మిక మార్కెట్ కూలిపోతుందని చెప్పారు. "అన్ని ఉద్యోగాలు ఆటోమేటెడ్ అవుతాయి, అప్పుడు 'ప్లాన్ బి' ఉండదు. మీరు తిరిగి శిక్షణ పొందలేరు" అని రోమన్ యాంపోల్స్కీ అన్నారు.