
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ఇండియన్ ఔట్‌సోర్సింగ్ కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకుంటున్న సమయంలో కేంద్ర మంత్రి 'అశ్విని వైష్ణవ్' కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన భారతదేశ ఐటీ పరిశ్రమను కాపాడుకోవడానికి అమెరికాతో కలిసి పనిచేయాలని, ఇతర మల్టీనేషనల్ కంపెనీలతో కూడా టచ్‌లో ఉండాలని ఆయన పేర్కొన్నారు.
భారతీయ ఐటీ రంగాన్ని మాత్రమే కాకుండా.. ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, దీనికి కావలసిన చర్యలను కేంద్రం తీసుకుంటోందని మంత్రి అన్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇండియా వాటా గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు.
మేము ఇప్పటికే అమెరికా, యూరప్, జపాన్, ఆగ్నేయాసియా ప్రభుత్వాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాము. భారతదేశంలోని పరిశ్రమలు శక్తివంతంగా ఉంచడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ సూచించారు. 5.67 మిలియన్లకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న, ఎగుమతి ఆదాయాలకు గణనీయంగా దోహదపడే భారతదేశ ఐటీ సేవల రంగం చాలా కాలంగా విదేశీ క్లయింట్లపై, ముఖ్యంగా అమెరికాలోని క్లయింట్లపై ఆధారపడింది.
ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన.. వాటిపై సుంకాలు ఎత్తివేత!
దేశంలో ఉద్యోగాలను రక్షించడం, కొత్త అవకాశాలను పెంచడం.. రెండింటినీ లక్ష్యంగా చేసుకుని ప్రస్తుత ఐటీ ఉపాధిని కాపాడటం, దేశీయ తయారీని పెంచడమే ప్రభుత్వం లక్ష్యం అని అశ్వని వైష్ణవ్ అన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయం 5.1 శాతం పెరిగి 282.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నాస్కామ్ అంచనా. ఇందులో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు వచ్చే ఆదాయంలో సుమారు 60 శాతం యూఎస్ నుంచే లభిస్తోంది.