గత కొంతకాలంగా ప్రపంచ టెక్ రంగాన్ని శాసిస్తున్న ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మాయాజాలం ఇప్పుడు ఒక క్లిష్టమైన దశకు చేరుకుంది. అల్లాద్దీన్ అద్భుత దీపంలా వ్యాపార సామర్థ్యాన్ని పెంచి, ఖర్చులను తగ్గించేస్తుందని నమ్మిన బిగ్ టెక్ కంపెనీలకు ఇప్పుడు ‘రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్’ (ఆర్‌ఓఐ) లేదా ‘పెట్టుబడిపై రాబడి’ రూపంలో అసలు సవాలు ఎదురవుతోంది. ఏఐ మౌలిక సదుపాయాల కోసం మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్, మెటా వంటి దిగ్గజాలు సమష్టిగా 2025లో సుమారు 320 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయని అంచనా. అయితే, ఈ భారీ వ్యయానికి తగ్గ ప్రతిఫలం వస్తోందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామం ఐటీ ఉద్యోగులకు ఒక రకంగా ఊరటనిచ్చే విషయమేనని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎందుకంటే, ఏఐ వాడకం పెరుగుతుందనే నెపంతో ఇప్పటివరకు టెక్ కంపెనీలు లేఆఫ్స్ (ఉద్యోగాల కోత)పై తీవ్రంగా ఫోకస్ చేశాయి. కానీ ఇప్పుడు ఏఐ మితిమీరిన ఖర్చులకు బ్రేకులు పడుతుండడంతో మున్ముందు లేఆఫ్స్ భయాలు తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఉబెర్‌లో ఇలా..
ప్రముఖ రైడ్-హెయిలింగ్ సంస్థ ఉబెర్‌లో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత పరిణామాలు ఏఐ బడ్జెట్ సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. ఉబెర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఆండ్రూ మెక్ డొనాల్డ్ ఇటీవల తమ ఏఐ వ్యయాలను సమర్థించుకోవడం కష్టంగా మారుతోందని బహిరంగంగానే అంగీకరించారు. ఉబెర్ ఎగ్జిక్యూటివ్‌లు అంతర్గతంగా ఈ సమస్యను ‘టోకెన్ మాక్సింగ్’గా పిలుస్తున్నారు. డెవలపర్లు భారీ మొత్తంలో ఏఐ కంప్యూట్ టోకెన్లను వినియోగిస్తున్నప్పటికీ ఆ ఖర్చంతా యూజర్లకు మెరుగైన ప్రొడక్ట్స్‌గా మారుతోందా లేదా అని ట్రాక్ చేయడానికి ఎలాంటి నమ్మదగిన మార్గం లేకపోవడమే దీనికి కారణం.
ఉబెర్ సీటీఓ ప్రవీణ్ నెప్పల్లి నాగ వెల్లడించిన వివరాల ప్రకారం.. క్లాడ్ కోడ్ కోసం కంపెనీ కేటాయించిన మొత్తం 2026 బడ్జెట్ కేవలం నాలుగు నెలల్లోనే పూర్తయింది. అయితే, ఉబెర్ ఉద్యోగులు ఏఐ టూల్స్‌ను చాలా మెరుగ్గా స్వీకరించారు. కంపెనీలోని 5,000 మందికి పైగా డెవలపర్లలో 92% కంటే ఎక్కువ మంది ప్రతి నెలా ఏఐ అసిస్టెంట్లను వాడుతున్నారు. ప్రస్తుతం ఉబెర్ రాసే కోడ్‌లో 10% ఏఐ సృష్టించిందే. అయినప్పటికీ, ఏఐ జనరేట్ చేసిన కోడ్ వల్ల కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగవుతోందా అంటే లీడర్‌షిప్ దగ్గర సమాధానం లేదు. ఉత్పాదకత పెరిగిందని చెబుతున్నా దానివల్ల కొత్తగా ఏ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయనే దానికి, ఖర్చుకు లింక్ దొరకడం లేదు.
వ్యూహం మార్చుకుంటున్న మైక్రోసాఫ్ట్, డ్యుయోలింగో
కేవలం ఉబెర్ మాత్రమే కాదు, ఏఐ రంగంలో అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్ సైతం ఇప్పుడు అప్రమత్తమైంది. భారీ ఏఐ విస్తరణల వల్ల పెరుగుతున్న వ్యయాన్ని నియంత్రించడానికి మైక్రోసాఫ్ట్.. ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ కోడ్‌తో సహా కొన్ని బాహ్య ఏఐ కోడింగ్ సబ్‌స్క్రిప్షన్లను తగ్గించడం ప్రారంభించినట్లు సమాచారం. మరోవైపు, లాంగ్వేజ్-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ‘డుయోలింగో’ గతంలో ఉద్యోగుల పనితీరును ఏఐ వినియోగ మెట్రిక్స్‌తో లింక్ చేస్తూ తెచ్చిన అంతర్గత విధానాన్ని వెనక్కి తీసుకుంది. ఏఐ సాధనాలు తమ పని నాణ్యతను పెంచకపోయినా కేవలం టార్గెట్ల కోసం వాటిని వాడాల్సి వస్తోందని సిబ్బంది ఫిర్యాదు చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
కంపెనీలు చేస్తున్న ప్రాథమిక తప్పిదం ఏంటి?
ప్రముఖ ఏఐ అధ్యాపకుడు అన్ష్ మెహ్రా విశ్లేషణ ప్రకారం.. చాలా కంపెనీలు ఏఐ అమలులో ప్రాథమిక తప్పు చేస్తున్నాయి. ఉద్యోగులు స్వయంగా ఆలోచించి పనిని నిర్మించుకోవడానికి ముందే పూర్తిగా ఏఐ వ్యవస్థలపై ఆధారపడుతున్నారు. దీనివల్ల వచ్చే అవుట్‌పుట్‌ను సరిచేయడానికి, డీబగ్ చేయడానికి మళ్లీ మానవ శ్రమ భారీగా అవసరమవుతోంది. ఫలితంగా.. సామర్థ్యం పెరగకుండానే కేవలం ‘టోకెన్ ఖర్చులు’ మాత్రమే కొండలా పేరుకుపోతున్నాయి.
ఏఐ స్వీకరణకు సరైన మార్గం (అన్ష్ మెహ్రా సూచనలు)
తక్కువ రిస్క్ ఉండే రొటీన్ పనుల్లో మాత్రమే నిర్దిష్ట దశలను ఏఐతో ఆడిట్ చేయాలి. ఆయా విభాగాల్లోని అత్యంత అనుభవజ్ఞులైన వ్యక్తులతో మాత్రమే ఎల్‌ఎల్‌ఎమ్‌లను పరీక్షించి అవుట్‌పుట్‌లను ధ్రువీకరించాలి. ఉద్యోగులందరికీ ఏఐ లైసెన్సులు ఇచ్చేసే కంటే ముందు ఏది పని చేస్తుంది, ఏది పని చేయదు అనేది స్పష్టంగా డాక్యుమెంట్ చేయాలి.
పెరగనున్న భరోసా!
గతంలో ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి మాట్లాడుతూ.. ఏఐ పెట్టుబడుల వైపు వనరులను మళ్లించడం కోసం నియామకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ప్రస్తుత ఆర్థిక సమీక్షలు చూస్తుంటే ఈ వ్యూహం ఎంతవరకు లాభదాయకమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టెక్ కంపెనీలు ఏఐ వైపు అనాలోచితంగా పరుగెత్తి, ఉద్యోగులను తగ్గించుకుంటూ పోవడం ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఏఐ వల్ల ఆశించిన స్థాయిలో ఆర్‌ఓఐ రాకపోవడం, పైగా కంప్యూటింగ్ బడ్జెట్లు గుల్లవుతుండడంతో కంపెనీలు తిరిగి క్షేత్రస్థాయి వాస్తవాల్లోకి వస్తున్నాయనే వాదనలున్నాయి. ఫలితంగా, ఉద్యోగుల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందనే భయాలు తగ్గి, లేఆఫ్స్ వేగం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు


