ఎవరెడీకి చైర్మన్, ఎండీలు బైబై

Aditya Khaitan and Amritanshu Khaitan have tendered their resignations from the Board - Sakshi

ఓపెన్‌ ఆఫర్‌ నేపథ్యంలో రాజీనామాలు

న్యూఢిల్లీ: డ్రై సెల్‌ బ్యాటరీలు, ఫ్లాష్‌లైట్ల తయారీ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్‌ నాన్‌ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అదిత్య ఖైతాన్, ఎండీ అమృతాన్షు ఖైతాన్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. ఎవరెడీ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డాబర్‌ ప్రమోటర్లు బర్మన్‌ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించిన నేపథ్యంలో వీరిరువురూ పదవులకు గుడ్‌బై చెప్పినట్లు కంపెనీ పేర్కొంది. షేరుకి రూ. 320 ధరలో 1.89 కోట్ల ఎవరెడీ షేర్ల కొనుగోలుకి వివిధ సంస్థల ద్వారా సోమవారం నుంచి బర్మన్‌ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి(3) నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఆదిత్య, అమృతాన్షు బోర్డుకి రాజీనామాలు సమర్పించినట్లు ఎవరెడీ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. తద్వారా కొత్త యాజమాన్యం నేతృత్వంలో కంపెనీ లబ్ధి్ద పొందేందుకు వీలు కల్పించాలని వీరిరువురూ నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది.  

తాత్కాలిక ఎండీగా..
ఆదిత్య, అమృతాన్షు ఖైతాన్‌ల రాజీనామాలను ఆమోదించిన బోర్డు కంపెనీ జేఎండీగా వ్యవహరిస్తున్న సువమాయ్‌ సాహాకు మధ్యంతర ఎండీగా బాధ్యతలు అప్పగించినట్లు ఎవరెడీ వెల్లడించింది. వివిధ సంస్థల ద్వారా ఎవరెడీలో 19.84 శాతం వాటా కలిగిన బర్మన్‌ గ్రూప్‌ గత వారం 5.26 శాతం అదనపు వాటాను సొంతం చేసుకోవడం ద్వారా సోమవారం ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించిన విషయం విదితమే. బీఎం ఖైతాన్‌ గ్రూప్‌ నిర్వహణలోని ఎవరెడీ కొనుగోలుకి డాబర్‌ ప్రమోటర్లు బర్మన్‌ కుటుంబం ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎవరెడీలో బర్మన్‌ కుటుంబ వాటా 25.11 శాతానికి చేరింది. దీంతో నిబంధనల ప్రకారం ఓపెన్‌ ఆఫర్‌కు డాబర్‌ తెరతీసింది. ప్రస్తుతం ఎవరెడీలో ఖైతాన్‌ కుటుంబానికి 4.84 శాతం వాటా మాత్రమే ఉంది.  
ఈ వార్తల నేపథ్యంలో ఎవరెడీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.2% బలపడి రూ. 357 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top