రూ.59 వేల కోట్లు బాకీ పడిన టీజీ జెన్కో
యాజమాన్యం వైఫల్యంతో ఆందోళనలకు దిగిన కార్మిక సంఘాలు
గప్చుప్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జెన్కో నుంచి రావాల్సిన బకాయిల వసూళ్ల విషయంలో సింగరేణి యాజమాన్యం నిర్లిప్తత కొనసాగుతూనే ఉంది. దీంతో హక్కుల కోసం పోరాడే కార్మిక సంఘాలు ఇప్పుడు సంస్థ పరిరక్షణ పేరుతో బకాయిల వసూళ్లకు రంగంలోకి దిగాయి. ఇప్పటికే టీజీబీకేఎస్, ఎస్సీఈయూ గళం విప్పగా తాజాగా గుర్తింపు సంఘమైన ఎస్సీడబ్ల్యూయూ సైతం నిరసన తెలిిపింది.
ఒక్కొక్కరుగా
వినియోగించుకున్న బొగ్గు, విద్యుత్కు సరిపడా జెన్కో నుంచి చెల్లింపులు జరగకపోవడంతో సింగరేణి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. భారీ యంత్రాల కొనుగోలును పక్కన పెడితే కనీసం యంత్రాల విడిభాగాలు, పని ముట్లు కూడా కొనలేని పరిస్థితి ఎదురవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బకాయిల అంశంపై కోల్బెల్ట్ ఏరియాలో భారీ క్యాంపెయిన్ చేపట్టింది. అంతకుముందు ఏప్రిల్ 27న సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీుస్ యూనియన్ విద్యుత్ సౌధ ముందు ధర్నా నిర్వహించింది. ఇప్పుడు ఏకంగా సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ – సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు విద్యుత్ సౌధ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. జెన్కో చెల్లింపుల్లో జాప్యం కారణంగా కార్మికులకు చెల్లించాల్సిన దసరా అడ్వాన్స్, లాభాల వాటా, దీపావళి బోనస్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారిందని నిరసన సందర్భంగా ఏఐటీయూసీ – ఎస్సీడబ్ల్యూయూ నేతలు పేర్కొన్నారు.
సింగరేణికి గుదిబండలా మారిన బకాయిలు
సింగరేణిలో 51శాతం రాష్ట్ర ప్రభుత్వం, 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంది. సింగరేణి యాజమాన్యంలో సీఎండీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించగా.. డైరెక్టర్లుగా సంస్థ ప్రతినిధులతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తరఫున అఖిల భారత సర్వీసుల అధికారులు ఉంటారు. ఇంత మంది ఉన్నప్పటికీ బకాయిల వసూలు విషయంలో కార్యాచరణ లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. కొండలా బకాయిలు పేరుకుపోతున్నా సామరాస్యంగా పరిష్కరించే విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపడం లేదు. ఫలితంగా కార్మిక సంఘాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. సింగరేణి, జెన్కో ఉన్నత స్థాయి అధికారుల భేటీ నిర్వహించి బకాయిలు సెటిల్ చేసుకోవాలని ఈ ఏడాది జనవరిలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్రెడ్డి సూచించారు. కానీ ఆ తర్వాత ఈ అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోవడం గమనార్హం.


