అటవీ సంపద పరిరక్షణ ఉద్యోగుల బాధ్యత | - | Sakshi
Sakshi News home page

అటవీ సంపద పరిరక్షణ ఉద్యోగుల బాధ్యత

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

చండ్రుగొండ: అటవీ సంపదను పరిరక్షించే బాధ్యత ఉద్యోగులపై ఉందని చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(సీసీఎఫ్‌) భీమానాయక్‌ తెలిపారు. చండ్రుగొండ మండలం మద్దకూరు శివారు మద్దుకూరు సెక్షన్‌లో ప్లాంటేషన్‌ను మంగళవారం ఆయన డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీఎఫ్‌ మాట్లాడుతూ అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో ప్లాంటేషన్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఈమేరకు ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షించాలని, కొత్తగా పోడు నరికే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రేంజ్‌ అధికారి తేజస్వీ, డీఆర్‌ఓ లక్ష్మిపతి, ఉద్యోగులు పాల్గొన్నారు.

కుష్ఠు సర్వే, కంటి పరీక్షలు వేగవంతం చేయాలి

చుంచుపల్లి: జిల్లాలో కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వే, కంటి పరీక్షలు, పాఠశాలల్లో ఆరోగ్య కార్యక్రమాలను వేగవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ తుకారామ్‌ రాథోడ్‌ ఆదేశించారు. ఆయా విభాగాల ఉద్యోగులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈనెల 22నుంచి నవంబర్‌ 4 వరకు కుష్ఠు వ్యాధి సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి అనుమానితులను గుర్తించాలని తెలిపారు. అలాగే, ప్రభుత్వ, ఏకలవ్య పాఠశాలల్లో 6 – 10వ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అద్దాలు అందించాలని సూచించారు. జిల్లాలోని 2,454 పాఠశాలలకు గాను 1,543 పాఠశాలల్లో ఆరోగ్య కార్యక్రమాలు పూర్తయినందున, మిగిలిన స్కూళ్లలో కూడా త్వరగా పరీక్షలు చేయాలని తెలిపారు.

కొనసాగుతున్న

‘ఓపెన్‌’ పరీక్షలు

కొత్తగూడెంఅర్బన్‌: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం ఇంటర్‌లో 69మందికి 64 మంది, పదో తరగతి పరీక్షకు 213 మందిలో 178 మంది హాజరయ్యారని డీఈఓ శంభుప్రసాద్‌ తెలిపారు. పలు పరీక్ష కేంద్రాలను డీఈఓతో పాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ తనిఖీ చేశారు.

పోలీసు ఉద్యోగ శిక్షణకు 100 మంది ఎంపిక

భద్రాచలంటౌన్‌: పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఐటీడీఏ ఆధ్వర్యాన ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించడమే కాక ఫిజికల్‌ టెస్టు నిర్వహించి ప్రతిభ ఆధారంగా 100 మందిని ఎంపిక చేసినట్లు డీడీ చందన తెలిపారు. ఇందులో 67 మంది యువకులు, 33 మంది యువతులు ఉన్నారని పేర్కొన్నారు. పీఓ బి.రాహుల్‌, పీఈటీసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీరూనాయక్‌ పర్యవేక్షణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎంపిక జరిగిందని తెలిపారు. ఏసీఎంఓ రమేష్‌, పీజీహెచ్‌ఎం మోతేరు, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ గోపాలరావు, పీడీలు రాంబాబు, నాగేశ్వరరావు, పార్వతి, కృష్ణారావు పాల్గొన్నారు.

పలువురు ఎస్సైల బదిలీ

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ మంగళవారం ఎస్పీ బి.రోహిత్‌రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం వీఆర్‌లో ఉన్న పి.రఘును ఏడూళ్ల బయ్యారం, కొత్తగూడెం త్రీటౌన్‌ ఎస్సై డి.విజయకుమారిని చండ్రుగొండకు, చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణను కొత్తగూడెం వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న బి.సాయికిషోర్‌రెడ్డిని అశ్వారావుపేటకు కేటాయించారు. అలాగే, అశ్వారావుపేట ఎస్సై టీ.యయాతి రాజును వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నేడు అండర్‌–19 క్రికెట్‌ జట్టు ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌: అండర్‌–19 బాలుర జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపికకు బుధవారం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష్య కార్యదర్శులు డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌ కుమార్‌, జి.వీరేష్‌గౌడ్‌ తెలిపారు. ఖమ్మంలోని డెక్కన్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో పోటీలు ఉదయం 10గంటలకు మొదలవుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు కిట్‌తో హాజరుకావాలని, వివరాలకు 98488 82551 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement