పోస్టల్‌ బ్యాలెట్‌పై దృష్టి | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌పై దృష్టి

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

● నేడు, రేపు ఆర్‌టీసీలో పోస్టల్‌ బ్యాలెట్‌ ● ముగింపు దశకు చేరిన ‘గుర్తింపు’ సంఘం ఎన్నికలు

● నేడు, రేపు ఆర్‌టీసీలో పోస్టల్‌ బ్యాలెట్‌ ● ముగింపు దశకు చేరిన ‘గుర్తింపు’ సంఘం ఎన్నికలు

చుంచుపల్లి: ఆర్‌టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు కీలక దశకు చేరాయి. ఈనెల 9న సాధారణ పోలింగ్‌ జరగగా, ఆరోజు విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోనున్నారు. ఈమేరకు గురు, శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం 10–30నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉద్యోగులు ఓటు వేయొచ్చు. ఇప్పటికే సాధారణ పోలింగ్‌లో నమోదైన ఓట్ల ఆధారంగా గెలుపోటములు ఖరారు కాగా, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా మెజార్టీ పెరిగేలా రెండు కూటముల నాయకులు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. రీజియన్‌ పరిధిలో 45 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు అర్హత సాధించారు. ఇందులో మణుగూరు డిపో నుంచి 12 మంది, భద్రాచలం డిపోలో 11మంది, సత్తుపల్లిలో తొమ్మిది మంది, ఖమ్మం డిపో నుంచి ఏడుగురు, మధిర, కొత్తగూడెం, ఇల్లెందు డిపోల నుంచి ఇద్దరు చొప్పున సిబ్బంది ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో గెలుపోటముల్లో తేడా వచ్చే అవకాశం లేకున్నా, ఆధిక్యతపై ఆసక్తి నెలకొంది.

డిపోల వారీగా హోరాహోరీ

ఖమ్మం రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోలు, ఆర్‌ఎం కార్యాలయంలో రెండు ప్రధాన కూటముల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. మొత్తం 1,789 మంది ఓటర్లకు గాను 1,727 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 17 మంది వివిధ కారణాలతో పోలింగ్‌కు దూరమయ్యారు. మరో 45 మందికి పోస్టల్‌ బ్యాలెట్‌కు అర్హత సాధించారు. సాధారణ పోలింగ్‌ అనంతరం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఐక్య కూటమికి 1,114 ఓట్లు, ఎన్‌ఎంయూ జేఏసీ కూటమికి 610 ఓట్లు లభించాయి. మరో 14 ఓట్లు చెల్లకపోగా, మిగతా ఓట్లు ఇతరులకు నమోదయ్యాయి. తద్వారా రెండు కూటముల మధ్య 504 ఓట్ల తేడా ఉంది. రీజియన్‌ వ్యాప్తంగా ఐక్య కూటమి ఆధిక్యంలో నిలవగా, కొన్ని డిపోల్లో జేఏసీ కూటమి కూడా గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. పలు డిపోల్లో ఐక్య కూటమి ఆధిక్యం ప్రదర్శించగా, సత్తుపల్లిలో మాత్రం జేఏసీ కూటమి కాస్త ముందంజలో నిలిచింది. ఈనేపథ్యాన పోస్టల్‌ బ్యాలెట్‌ అనంతరం అధికారికంగా 17వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement