కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ సందడి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ సందడి

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

● గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదుకు పరిశీలకులు ● మంత్రులు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల బాధ్యతలు ● ఇటీవలే జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రులు

● గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదుకు పరిశీలకులు ● మంత్రులు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల బాధ్యతలు ● ఇటీవలే జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రులు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్‌ పార్టీలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ స్థానానికి పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని ప్రకటించింది. మునుపెన్నడూ లేని విధంగా ముందస్తుగానే అభ్యర్థిని ప్రకటించగా.. ఇప్పటికే జిల్లా మంత్రులు ఖమ్మంలో ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈక్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ మంగళవారం నియోజకవర్గాల వారీగా ఓటర్ల నమోదుకు పరిశీలకులను నియమించారు.

పట్టు సాధించాలని..

గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. పొత్తుతో కొత్తగూడెం స్థానంలో సీపీఐ గెలిచింది. ఇదే పరంపర గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ ఎన్నిక పార్టీకే కాక ప్రభుత్వానికి కీలకమైనందున ఎక్కడా వెనక్కి తగ్గొద్దనే వ్యూహంతో కాంగ్రెస్‌ ముందుకెళ్తోంది. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండడంతో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తారనే ధీమా నేతల్లో వ్యక్తమవుతోంది.

నిరసన స్వరం.. అయినా విధేయత

పార్టీ నేతలంతా నియోజకవర్గాల వారీగా సమన్వయంతో అడుగులు వేస్తేనే అభ్యర్థి విజయం, మెజార్టీ సాధ్యమవుతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు, కేడర్‌ గ్రూపుల వారీగా విడిపోయినా.. మంత్రులు, ఎమ్మెల్యేలపై మాత్రం విధేయత చూపుతున్నారు. సాధారణ ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా పని చేసిన నేతలు పలువురికి నామినేటెడ్‌ పదవులు దక్కలేదన్న నిరాశలో ఉన్నారు. కొందరు పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. అంతేకాక పాత, కొత్త నేతల మధ్య వైరం పెరిగింది. తొలి నుంచి ఉన్న నేతలను కాదని, ఎన్నికల ముందు చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన కొందరిలో ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పలు మండలాల్లో కొత్త నేతలకే పెద్దపీట వేస్తున్నారనే చర్చ పాత నేతల్లో కొనసాగుతోంది.

ఎవరి నియోజకవర్గం వారికే..

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఓటర్ల నమోదు బాధ్యతలను టీపీసీసీ నేతలకు అప్పగించింది. ఓటరు నమోదే కాక ఎన్నికల వరకు నేతలు, కేడర్‌ సమన్వయం చేసేలా మంత్రులు, ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల బాధ్యతలే కేటాయించారు. నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ కేతావత్‌ శంకర్‌నాయక్‌ను భద్రాచలం నియోజవర్గానికి, ఎంపీ రఘురాంరెడ్డిని కొత్తగూడెం నియోజకవర్గ పరిశీలకులుగా నియమించారు. అత్యధికంగా పట్టభద్రులను ఓటర్లుగా నియమించేలా సమీక్షలు నిర్వహించాలని టీపీసీసీ సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement