పామాయిల్‌ స్పీడ్‌కు ట్యాక్స్‌ బ్రేకులు | - | Sakshi
Sakshi News home page

పామాయిల్‌ స్పీడ్‌కు ట్యాక్స్‌ బ్రేకులు

Oct 5 2026 12:15 AM | Updated on Oct 5 2026 12:15 AM

లాభాల్లో వాటా పెంచేదెప్పుడు?

ఆమేరకు ఆదాయం కోల్పోతున్న రైతులు

ప్రత్యామ్నాయ మార్గాలున్నా పట్టించుకోని ప్రభుత్వం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆయిల్‌పామ్‌ సాగులో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానం చేరుకోవడం లక్ష్యంగా తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ తరుణంలో పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించడం ఇబ్బందికరంగా మారింది. దీని వల్ల పామాయిల్‌ రైతుల రాబడి తగ్గనుంది. ఈ నేపథ్యంలో ఓవైపు ఆయిల్‌ ధరలు పెరగకుండా మరోవైపు పామాయిల్‌ రైతుల రాబడి తగ్గని విధంగా తీసుకోవాల్సిన చర్యలపై సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌.

ఓఈఆర్‌ ఆధారంగా చెల్లింపులు

తెలంగాణ కోఆపరేటివ్‌ ఆయిల్‌ సీడ్స్‌ గ్రోయర్స్‌ ఫెడరేషన్‌ (టీజీ ఆయిల్‌ఫెడ్‌) ఆధ్వర్యంలో రాష్ట్రంలో పామాయిల్‌ సాగుతోపాటు క్రూడ్‌ ఉత్పత్తి జరుగుతోంది. పామాయిల్‌ పరిశ్రమలో నెల రోజులపాటు ఆడించిన పామాయిల్‌ గెలలు, వాటి నుంచి ఉత్పత్తి జరిగిన క్రూడ్‌ ఆయిల్‌, వచ్చిన క్రూడ్‌ ఆయిల్‌కు దేశీ మార్కెట్‌లో ఉన్న రేటు అనే అంశాల ఆధారంగా టన్ను గెలలకు ధర నిర్ణయం జరుగుతుంది. దీనిని బట్టే ఆయిల్‌ పరిశ్రమలకు గెలలు సరఫరా చేసిన రైతులకు చెల్లింపులు జరుగుతాయి. దీన్ని ఆయిల్‌ ఎక్ట్సాక్షన్‌ రేట్‌ (ఓఈఆర్‌) అంటారు.

సుంకం తగ్గితే

దేశీయంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో గత నెల 24న పామాయిల్‌ దిగుమతులపై 16.5 శాతంగా ఉన్న సుంకాన్ని 11 శాతానికి కేంద్రం తగ్గించింది. దీంతో దిగుమతి చేసుకునే క్రూడ్‌ పామాయిల్‌ ధర తగ్గనుంది.దీన్ని అనుసరించే దేశీయంగా ఉత్పత్తి జరిగే పామాయిల్‌ ధర కూడా తగ్గుతుంది. ప్రస్తుతం ఆగస్టు నెల ఓఈఆర్‌ ఆధారంగా టన్ను పామాయిల్‌ గెలలకు రైతులకు రూ.24 వేలకు పైబడి ధర లభిస్తోంది. దిగుమతి సుంకం తగ్గడం వల్ల రమారమి టన్ను క్రూడ్‌ ఆయిల్‌ ధర రూ. 1.37 లక్షల నుంచి రూ.1.32 లక్షలకు పడిపోయింది. ప్రతీ టన్నుపై రూ.5,000 వంతున ధర తగ్గింది. దీన్ని ఆధారంగా సెప్టెంబర్‌ ఓఈఆర్‌ రైతులకు వర్తింపజేస్తే ప్రతీ టన్నుపై రూ.384 వంతున ధర తగ్గింది. ఇది అక్టోబరుకు వచ్చే సరికి రైతుకు సగటున వెయ్యి రూపాయల వరకు ధర తగ్గే అవకాశం ఉంది. సగటున ఎకరానికి 15 టన్నుల వంతున గెలల దిగుబడిని పరిగణనలోకి తీసుకుంటే అక్టోబరు నుంచి ప్రతీ ఎకరాపై పామాయిల్‌ రైతులు రూ.15,000 చొప్పున నష్టపోయే అవకాశం ఉంది.

ప్రోత్సాహం అందిస్తే

పామాయిల్‌ సాగుకు ప్రోత్సాహం లభిస్తున్న దశలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం రైతులకు ఇబ్బందికరంగా మారింది. దిగుమతి సుంకాన్ని పెంచితే ఆ మేరకు వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మధ్యే మార్గంగా సుంకాన్ని తగ్గించకుండా, పామాయిల్‌ రైతులకు ఎక్స్‌పోర్ట్‌ ఓరియెంటెడ్‌ యూనిట్‌ (ఈఓయూ) ప్రోత్సాహకాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో విదేశీ మారక ద్రవ్యం (అమెరికన్‌ డాలర్‌) ఎక్కువగా ఉపయోగిస్తున్న సరుకుల్లో ముడి పెట్రోల్‌ తర్వాత స్థానంలో పామాయిల్‌ ఉంటోంది. దీంతో ఈ రంగంలో దిగుమతి తగ్గితే ఆ మేరకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అంతర్జాతీయంగా రూపాయి కూడా బలపడుతుంది. దీంతో డాలర్‌ చెల్లింపులు తగ్గించే పరిశ్రమలను ఈఓయూలుగా కేంద్రం గుర్తిస్తోంది. ఇలా గుర్తించిన పరిశ్రమలకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ హాలిడే, క్యాపిటల్‌ సబ్సిడీ, పవర్‌ సబ్సిడీలు అందిస్తోంది.

అండగా నిలవాలి

పామాయిల్‌కు దేశంలో ఎంతో డిమాండ్‌ ఉంది. ఆ మేరకు సాగు, ఉత్పత్తి లేదు. దీంతో మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచ మార్కెట్‌లో సింగపూర్‌ తర్వాత అత్యధికంగా పామాయిల్‌ దిగుమతి చేసుకునే దేశంగా ఇండియా ఉంది. సాలీనా పది బిలియన్‌ డాలర్లను ఇందుకోసం వెచ్చించాల్సి వస్తోంది. పామాయిల్‌ సాగుకు సంబంధించి దేశంలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉమ్మడి ఏపీ ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి పోటీ ఇచ్చేలా తెలంగాణలో పామాయిల్‌ సాగు పెరుగుతోంది. ప్రస్తుతం 12 జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగవుతోంది. 80 వేల మందికి పైగా రైతులు సాధారణ వ్యవసాయం నుంచి పామాయిల్‌ వైపునకు మళ్లారు. రాబోయే రోజుల్లో ఐదు లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. రైతులకు మెరుగైన ఆదాయం ఇవ్వడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే పామాయిల్‌ రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయిల్‌పామ్‌ యాక్ట్‌ –1991 రూపొందింది. దీని ఆధారంగా పామాయిల్‌ రైతులకు గెలలతో పాటు వాటి గింజపైన ఆదాయం వస్తోంది. కానీ గడిచిన 30 ఏళ్లలో పామాయిల్‌ పరిశ్రమలో ఎన్నో కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. పామయిల్‌ గెలలు, గింజలతోపాటు పిప్పి (ఫైబర్‌), కెర్నెల్‌ ఆయిల్‌, పామ్‌ కెర్నెల్‌ కేక్‌, డీమక్‌ వంటి అనేక ఇతర ఉత్పత్తుల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుతం ఇలా వచ్చే అదనపు ఆదాయమంతా ఆయిల్‌ఫెడ్‌ ఖాతాలోకే పోతోంది. రైతులకు షేర్‌ ఇవ్వడం లేదు. ఈ విధానంలో మార్పు చేయాలని రైతులు కోరుతున్నారు.

పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement