ఇల్లెందు, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు కనకయ్య, మురళీ నాయక్
ఇల్లెందు: ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు సీతారామ ప్రాజెక్ట్ నుంచి తాగు, సాగు అవసరాలకు గోదావరి జలాలు సాధిస్తామని ఇల్లెందు, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, భూక్యా మురళీనాయక్ వెల్ల డించారు. కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల నీటిపారుదలశాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆదివారం చీమలపాడు – రేలకాయలపల్లి అటవీ ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లెందు నియోజకవర్గానికి, పాలేరుకు నీరు అందించే పంపింగ్, లిఫ్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. లిఫ్ట్ ద్వారా చీమలపాడు నుంచి లలితాపురం – ఇల్లెందుకు ఒక కాల్వ, రాఘబోయినగూడెం నుంచి గార్ల వైపుకు మరో కాలువ, లలితాపురం నుంచి బయ్యారం ఇంకో కాలువ, లలితాపురం నుంచి రోళ్లపాడుకు మరో కాలువ ఏర్పాటు చేసి 1500 క్యూసెక్కుల నీటిని తరలించాలని ప్రతిపాదన ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. అయితే పాపకోలు నుంచి చీమలపాడు వైపు రావాలంటే 6 వేల మీటర్ల పొడవు గుట్ట అడ్డుగా ఉన్నందున సొరంగ మార్గం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు జలాలు ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్, పాలేరుకు వస్తే ఈ ప్రాంతాలు సస్య శ్యామలం అవుతాయని ఇటీవల జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి కోరినట్లు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు మహేశ్వర్‌రావు, చంద్రశేఖర్, రవికుమార్, సాగర్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.


