పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను అందజేయాలని సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఐటీడీఏ, సబ్ కలెక్టరేట్‌లో..
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాలకు అన్ని శాఖల అధికారులు ఉదయం 10.30 గంటలకు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
విద్యుదుత్పత్తి పునరుద్ధరణ
పాల్వంచ: ఎనిమిది వందల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ ఏడో దశ కర్మాగారంలో బాయిలర్ ట్యూబ్ లీకేజీ కారణాల వల్ల శుక్రవారం రాత్రి ఉత్పత్తి నిలిచింది. సీఈ శివరామ్ రెడ్డి ఆధ్వర్యంలో మరమ్మతు పనులు పూర్తి చేశారు. ఉత్పత్తి తిరిగి ప్రారంభించి ఆదివారం రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
మణుగూరువాసికి డాక్టరేట్
మణుగూరు టౌన్: మణుగూరు మున్సిపల్ సీనియర్ అకౌంటెంట్ శ్యాంసన్ గిడ్ల పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు. రెండు రోజుల క్రితం జరిగిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 26వ స్నాతకోత్సవంలో పట్టా ప్రదానం చేశారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు. ‘ఈఎస్జీ మరియు ఫర్మ్ పెర్ఫార్మెన్స్, మోడరేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎర్నింగ్ మేనేజ్‌మెంట్’ అనే అంశంపై ప్రొఫెసర్ ప్రశాంత్‌కుమార్ మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తి చేసి చేశారు. డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సమీర్ కామత్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. శ్యాంసన్‌ను పలువురు అభినందించారు.
‘ఎలివేట్’లో
ప్రథమ బహుమతి
భద్రాచలంఅర్బన్: గోదావరి తీరంలో కనిపించిన మొసళ్లను డ్రోన్ కెమెరాతో వినూత్నంగా చిత్రీకరించిన భద్రాచలానికి చెందిన గంజి ఎడ్వర్డ్ రాజు ‘ఎలివేట్–2026’ పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. రెడ్డిపాలెం బ్రిడ్జి వద్ద గోదావరి నదీ తీరాన్ని డ్రోన్‌తో చిత్రీకరిస్తున్న సమయాన కనిపించిన మొసళ్ల కదలికలతోపాటు నదీ ప్రవాహం, ప్రకృతి అందాల వీడియోను ఆయన పోటీకి పంపించారు. ఎడిట్ పాయింట్, పీపీఐఎన్, డ్రోనిక ఇన్నోవేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో 200 మంది పాల్గొనగా వివిధ కేటగిరీల్లో 30 మందిని అవార్డులకు ఎంపిక చేశారు. ఇందులో ఎడ్వర్డ్ రాజు రూపొందించిన వీడియో ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన భారత్ కళాపురస్కార్ ట్రోఫీ అందుకున్నాడు.
చేపలకు గాలం..
చిక్కిన మొసలి
దుమ్ముగూడెం : మండలంలోని తూరుబాక గ్రామ శివారు గోదావరిలో చేపల కోసం వేసిన గాలానికి మొసలి పడింది. గ్రామానికి చెందిన గుమ్మడి రఘు ఆదివారం గోదావరిలో చేపల వేటకు వెళ్లాడు. గాలం వేయగా బరువుగా తగలడంతో పెద్ద చేప పడిందని సంబరపడిపోయాడు. తీరా బయటకు లాగుతుండగా మొసలి ప్రత్యక్షం కావడంతో అక్కడి నుంచి పరుగులంకించుకున్నాడు. గోదావరిలో మొసలి ప్రత్యక్షం కావడంతో తూరుబాక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


