ఈ నెల 12 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు
శ్రీలక్ష్మి తాయారు అమ్మవారికి అష్టలక్ష్మి అలంకారాలు
21న శమీ, ఆయుధ పూజలు, విజయయాత్ర
26న వాల్మీకి జయంతి, శబరి స్మృతియాత్ర
‘జ్ఞానేశ్వరి..విజయ ప్రధా’ అని కీర్తిస్తారు పరాశర భట్టార్. విజయం అంటే కేవలం యుద్ధవిజయం మాత్రమే కాదని, అన్ని రంగాలలో విజయమని అర్థం. ఈ రూపంలో అమ్మవారిని సేవిస్తే అన్ని రంగాల్లో సునిశితమైన జ్ఞానాన్ని ప్రసాదించి, తద్వారా విజేయులను చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. సుందరకాండ పారాయణం నిర్వహిస్తారు.
‘హిరణ్యవర్ణాం హరిణీంసువర్ణ రజతస్రజాం..’అంటూ శ్రీ సూక్తం అమ్మవారిని ధనలక్ష్మిగా కీర్తిస్తుంది. ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. విద్య, బలం, కీర్తి మొదలయినదంతా ధనమేనని అర్థం. విద్యాధనం, హిరణ్య ధనం, శక్తి ధనంలను ప్రసాదిస్తుంది కాబట్టే అమ్మకు ధనలక్ష్మి అని ప్రతీతి. అరణ్యకాండ పారాయణం నిర్వహిస్తారు.
‘దారిద్య్ర ధ్వంసినీందేవీం సర్వోపద్రవవారిణీం...’ అని అమ్మవారిని వీరలక్ష్మిగా కీర్తిస్తుంది పురాణం. దారిద్య్రాన్ని, అన్ని రకాల ఉపద్రవాలను పారదోలే వీరత్వం అమ్మ సొంతం. ఈ రూపంలో అమ్మను ఆరాధిస్తే అన్ని రకాల దుష్ట శక్తులు, భయాలు, ఉపద్రవాలు తొలగిపోతున్నాయని ప్రతీతి. యుద్ధకాండ పారాయణం చేస్తారు.
విజయదశమి సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం ఆలయంలో విశేష పూజలు, సాయంత్రం భక్తరామదాసు నిర్మించిన దసరా మండపంలో, మహా పట్టాభిషేకం, శమీపూజ, ఆయుధపూజ, లక్ష్మీనారాయణ దాస ఉత్సవాది కార్యక్రమాలు, విజయయాత్ర, శ్రీరామలీలా మహోత్సవాలు నిర్వహించనున్నారు. 26న వాల్మీకి జయంతి, శబరి స్మృతి యాత్ర జరపనున్నారు. అదే రోజు కార్తీక మాస ప్రారంభాన్ని పురస్కరించుకుని గతంలో మాదిరిగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
భద్రాచలం: భద్రగిరి శ్రీ సీతారామ చంద్రస్వామివారి క్షేత్రం దసరా వేడుకలకు సిద్ధమవుతోంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు, అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తొమ్మిది రోజులు.. తొమ్మిది అలంకారాలు
శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు తొమ్మిది రోజులపాటు తొమ్మిది అలంకారాల్లో దర్శనమిస్తారు. రోజూ ప్రత్యేక పూజలు, పారాయణాలు నిర్వహించనున్నారు. సుమారు 108 మంది పారాయణదారులతో ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు శ్రీరామాయణ పారాయణోత్సవాలు జరుపుతారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో తానీషా కల్యాణ మండపం వెనుక ఉన్న మారుతి సదనంలో పారాయణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు రోజూ సంకీర్తన, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా అభివృద్ధి పనుల నేపథ్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో జరిపే తిరువీధి సేవలను రద్దు చేశారు.


