మరికొన్ని ముఖ్య ఘటనలు
వీర తెలంగాణ విప్లవ రైతాంగ పోరాటంలో జిల్లావాసులు
నైజాం తొత్తులుగా మారి స్థానిక పాలన చేపట్టిన భూస్వాములు, దొరలను ఎదిరిస్తూ సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రక్తం చిందించినవారు జిల్లా నుంచి కూడా ఉన్నారు. చరిత్ర పుటల్లో ఎక్కువగా చోటు దక్కక పోయినా ఆ వీరుల గాథలు కొంత మేరకు పుచ్చలపల్లి సుందరయ్య రాసిన వీర తెలంగాణ విప్లవ పోరాటం అనే పుస్తకంలో లభించాయి. తెలంగాణ సాయుధ పోరు విరమించి నేటి(సెప్టెంబర్ 17)కి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
పాల్వంచ ప్రాంత కమ్యూనిస్టు దళంలో 1948 మార్చిలో దమ్మపేట మండలం జమేదార్ బంజర గ్రామానికి చెందిన గిరిజన యోధుడు సోయం గంగులు చేరాడు. అనతికాలంలోనే పాల్వంచ అటవీ ప్రాంతాన్ని కమ్యూనిస్టులకు తిరుగులేని విప్లవ స్థావరంగా మార్చడంలో కీలక భూమిక పోషించాడు. మన్యం అటవీ మార్గాల్లో గంగులు దళాలను సమర్థవంతంగా నడిపిస్తూ రజాకార్ల దాడులను ఎక్కడికక్కడ తిప్పికొట్టాడు. నల్లమల గిరిప్రసాద్ దళానికి రక్షణ కవచంలా నిలిచింది. దీంతో సోయం గంగులును మట్టుబెట్టాలని భూస్వాములు, పెత్తందార్లు పన్నాగం వేశారు. ఆయన సమీప బంధువునే కోవర్టుగా ఉపయోగించుకుని ప్రస్తుత ఏపీలోని జీలుగుమిల్లి అటవీ ప్రాంతంలో గంగులును శత్రు బలగాలు బంధించాయి. చిత్రహింసలకు గురిచేసినా పార్టీ రహస్యాల గుట్టు విప్పలేదు. చివరకు 1951 మే 12న సత్తుపల్లి ప్రాంతంలోని రుద్రాక్షపల్లిలో రావిచెట్టుకు గంగులును కట్టేసి తుపాకీలతో కాల్చి చంపారు.
సాయుధ పోరాటంలో సోయం గంగులు ‘కోయ బెబ్బులి’గా చేసిన త్యాగం, రాజీలేని పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. మరుగునపడిన ఇలాంటి వీరుల త్యాగాలను స్మరించుకోవాలి.
–ఎస్‌కే సాబీర్ పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి
సాయుధ పోరాట
ఊహా (ఏఐ) చిత్రం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946లో మొదలై 1951 వరకు రెండు దశల్లో జరిగింది. ఆరంభంలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాలలో విప్లవ జ్వాలలు రాజుకున్నాయి. సుదీర్ఘ కాలం పోరాటం సాగడంతో గెరిల్లా శిక్షణ కోసం జిల్లాలోని అడవులను, ఆయుధాల కోసం సింగరేణి గనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలు అవసరం పడ్డాయి. అలా రైతాంగ పోరాటం జిల్లాలోకి అడుగు పెట్టింది. 1949 తర్వాత రైతాంగ పోరాటం ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగానే కొనసాగింది. అందులోనూ కొత్తగూడెం, ఇల్లెందు లాంటి పట్టణాలు పాల్వంచ, అశ్వారావుపేట వంటి సంస్థానాల్లో ఇండియన్ ఆర్మీ, విప్లవకారుల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది.
భద్రాచలం ఏజెన్సీలోని వరరామచంద్రాపురం మండలం పేరంటాలపల్లి (ప్రస్తుతం ఏపీలో ఉంది)లో అల్లూరి సీతారామరాజు సమకాలికుడు, ఉద్యమ సహచరుడిగా పేరున్న సింగరాజు అనే సాధువు రెండు వందల మందికి పైగా పోరాట యోధులకు గెరిల్లా యుద్దతంత్రంలో శిక్షణ ఇచ్చారు. ఇల్లెందు, కొత్తగూడెం బొగ్గు గనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాల గిడ్డంగులపై విప్లవకారులు దాడులు చేశారు. వాటిని నిజాం పోలీసు క్యాంపులపై దాడులు చేయడానికి ఉపయోగించారు. పోరాటం ఉధృత రూపం దాల్చడంతో పాల్వంచ సంస్థానంలో కోయ దళాలు, బొగ్గు గనుల ప్రాంతంలో కార్మిక సంఘాలు సాయుధ పోరాటానికి నడుం బిగించాయి.
పాల్వంచ సంస్థానంలో భూపంపిణీ లక్ష్యంగా 120 ఆదివాసీ యువకులతో గెరిల్లా దళం ఏర్పాటైంది. దీన్ని అణచివేసేందుకు నిజాం సర్కార్ వేయి మంది సైనికులను పాల్వంచ తాలూకాకు పంపింది. 15 రోజులపాటు జరిగిన పోరులో ఎనిమిది మంది నిజాం సైనికులు చనిపోయారు. గెరిల్లా దళ నాయకుడు ముత్యాలు చనిపోగా మరో ఆరుగురిని నిజాం సర్కార్ ఉరి తీసి చంపింది. ఆ తర్వాత రజాకార్ దళాలు ములకలపల్లిలో క్యాంపు ఏర్పాటు చేశాయి. పాల్వంచలో నష్టపోయిన కోయ దళాలు ములకలపల్లిలోని రజాకార్ క్యాంపుపై నిత్యం దాడులు చేసింది. చివరకు బతుకుజీవుడా అనుకుంటూ ఈ క్యాంపును ఎత్తివేయాల్సి వచ్చింది. మరోవైపు సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో 1938లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రహస్యంగా ఏర్పడింది. హెడ్డాఫీసులో క్లర్క్‌గా పని చేస్తున్న శేషగిరిరావు సాయుధ పోరాటంలో మొదటి అడుగు వేశారు. చివరకు శేషగిరిని 1948 ఏప్రిల్‌లో నెల్లిపాక దగ్గర నిజాం పోలీసులు కాల్చి చంపారు.
అన్నపురెడ్డిపల్లి మండలంలో గుంపెన గ్రామంలో 1948లో రజాకార్లకు సాయుధ పోరాట యోధులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. వట్టికుంట నాగేశ్వరరావు నేతృత్వంలో గుంపెనలో సమావేశమైన 70 మంది సభ్యులతో కూడిన దళాన్ని కల్లూరు నుంచి భారీ సంఖ్యలో వచ్చిన రజాకార్లు చుట్టుముట్టారు. ప్రాణాలకు తెగించి విప్లవకారులు పోరాడుతూ అడవుల్లోకి దళం రిట్రీట్ అయ్యింది. ఈ దాడిలో ఒక గెరిల్లా, మరో ఇద్దరు గుంపెన గ్రామస్తులు చనిపోయారు. సాయుధ పోరాటంలో పాల్వంచ తాలూకా నుంచి 53 మంది, ఇల్లెందు తాలూకా నుంచి 70 మంది చనిపోయారు. ఇవి కాకుండా ఆనాటి పాల్వంచ తాలూకాలో ఉన్న ఆళ్లపల్లిలో 300 మంది, ఇల్లెందు తాలూకాలోని గుండాల దగ్గర జరిగిన పోరులో మరో 300 మంది పోరాటంలో ఉన్నవారు సామూహిక హత్యకు గురైనట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఇల్లెందు–నర్సంపేట రోడ్డులో గంగారం దగ్గర మిలిటరీ లారీ పేల్చివేత. కారేపల్లి మిలిటరీ క్యాంపుపై దాడి.
1949 జనవరి 1న తల్లాడ – కొత్తగూడెంలో కాల్పులు ఇద్దరు సైనికుల మృతి, ఏప్రిల్ 27న జరిగిన దాడిలో ఇద్దరు అధికారుల మృతి
1949 జనవరి 29న రోళ్లపాడు దగ్గర పోలీస్ కాన్వాయ్‌పై దాడి ముగ్గురు పోలీసుల మరణం
1949 మార్చి 26న కొత్తగూడెం సమీపంలో పోలీసుల లారీపై కాల్పులు నలుగురు మరణం
గెరిల్లా యుద్ధ తంత్రం రక్షణ చర్యల్లో భాగంగా 150 మైళ్ల రోడ్ల ధ్వంసం


