ఆలయ మాస్టర్ ప్లాన్‌లో తరచూ మార్పులు చేర్పులు తాజాగా వైదిక సభ్యుల సూచనలతో మళ్లీ మార్పు...? తొలుత ప్రణాళిక వెల్లడించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు మొదటి ప్రాకారం ఆగమ శాస్త్రం పరిధిలోనే ఉండాలని సూచనలు
మాస్టర్ ప్లాన్‌పై గోప్యత ఎందుకు?
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అభివృద్ధి మాస్టర్‌ప్లాన్‌పై అయోమయం కొనసాగుతోంది. తొలుత రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వైదిక సభ్యుల సలహాలతో మళ్లీ మార్పులు జరిగే అవకాశం ఉంది. తొలుత దేవాదాయ శాఖ ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ బహిర్గతం చేసి, అర్చకులు, వైదిక పెద్దల సలహాలు స్వీకరించి ఉంటే ఈ తిప్పలు ఉండేవికావు. మార్పులు, చేర్పుల నేపథ్యంలో అభివృద్ధి పనులు నిర్ణీత కాలంలో పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైదిక పెద్దలు, అర్చకులు
ఏం చెబుతున్నారంటే..
● ప్రస్తుతం ఆలయ దక్షిణ వైపు భాగంలో ఉపాలయాలను నిర్మిస్తున్నారు. పిల్లర్లు నిర్మించి వాటి పైభాగంలో నిర్మాణాలు సాగుతున్నాయని గమనించిన వైదిక సభ్యులు ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధమంటూ ఈఓ, దేవాదాయ శాఖ కమిషనర్, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. ఆలయాలకు ఎట్టి పరిస్థితులలో భూ స్పర్శ ఉండాలి.
● రెండో ప్రాకారంలో నిత్యకల్యాణ మండపాన్ని ఎత్తులో నిర్మించాలి. ఆగ్నేయ దిశలో నిర్మిస్తే 400 సీటింగ్ కెపాసిటీ వచ్చే అవకాశం ఉంది. అదే రెండో ప్రాకారంలో నిర్మిస్తే సుమారు 700 సీటింగ్ వస్తుంది. ఆగ్నేయంలో నిత్యకల్యాణ మండపం నిర్మిస్తే, గతంలో అక్కడ ప్రతిపాదించిన దర్బారు సేవా మండపం మారే అవకాశం ఉంటుంది.
● ప్రస్తుతం పశ్చిమ ముఖంగా ఉన్న స్వామివారి మూలమూర్తుల పక్కన లక్ష్మీ తాయారు అమ్మవారు, గోదాదేవి ఉపాలయం నిర్మించాలి. లక్ష్మీతాయారు అమ్మవారికి ఎదురుగా భక్త రామదాసు, గోదాదేవికి ఎదురుగా కనక సీతమ్మ విగ్రహాలను నిర్మించాలి. అభివృద్ధి పేరుతో భద్రుని గుడిని తవ్వొద్దు. రాళ్లను తరలించొద్దు. రెండో ప్రాకారంలో సాంకేతికంగా అభివృద్ధి ఉన్నా మొదటి ప్రాకారం పరిధిలో పనులు మాత్రం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించాలి.
ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌పై గోప్యత పాటిస్తున్నారు. క్రమంగా ప్లాన్‌లో మార్పులు జరుగుతున్నాయి. గతంలో ఆంజనేయస్వామి ఉపాలయం తొలగించేది లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉపాలయం పునర్‌నిర్మాణం ప్లాన్‌లో చేర్చారు. ఇలా చీటికిమాటికి ప్లాన్‌లో మార్పులు జరగడం అందరినీ అయోమయానికి గురిచేస్తోంది. మాస్టర్ ప్లాన్‌ౖపైపె అధికారులకు కూడా స్పష్టతలేనట్లు తెలుస్తోంది. ప్లాన్‌ను తమకు అందించాలని ఆలయ ప్రధాన అర్చకుడు విజయరాఘవన్, కోటి రామస్వరూప్ ఇటీవల ఈఓకు వినతిపత్రం ఇవ్వడం గమనార్హం. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణాలు జరగాలని అర్చకులు కోరుతున్నా, మంత్రులు సైతం అదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా జరుగుతుండటం గమనార్హం. ఇప్పటికై నా దేవాదాయ శాఖ దృష్టి సారించి మాస్టర్ ప్లాన్‌పై అన్ని వర్గాల ప్రజల సందేహాలను నివృత్తి చేసేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇవ్వాలని భక్తులు, అర్చకులు, వైదిక పెద్దలు కోరుతున్నారు.


