పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో తలనీలాలు పోగు చేసుకునే లైసెన్స్ హక్కులను ఏపీకి చెందిన వ్యక్తి రూ.18.75 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నాడు. మండల పరిధిలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో బుధవారం వ్యాపార దుకాణాలకు, తలనీలాలకు బహిరంగ వేలంపాట నిర్వహించారు. దేవాదాయ శాఖ కొత్తగూడెం డివిజనల్ పరిశీలకుడు కె.ఆనంద్ పర్యవేక్షించారు. భక్తులు సమర్పించిన తలనీలాలు పోగుచేసుకునేందుకు 11 నెలల కాలపరితికి వేలంపాట నిర్వహించగా, 12 మంది పోటీపడ్డారు. ఏపీ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పిరంగిపురానికి చెందిన శ్రీజగన్నాథం పాట దక్కించుకున్నాడు. గతేడాది తలనీలాలకు రూ.9.75 లక్షల ఆదాయం వచ్చింది. ఈ సారి రూ.9 లక్షల అదాయం అదనంగా లభించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ నెల 16 వరకు ఆలయంలో పోగుచేసిన తలనీలాలను నల్లగొండ జిల్లా త్రిపురారం గ్రామానికి చెందిన ఆనగొంది సైదమ్మ రూ.2.95 లక్షలకు సొంతం చేసుకున్నారు. మిలిగిన వ్యాపార దుకాణాల పాటదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ నెల 30వ తేదీకి వేలంపాటలను వాయిదా వేసినట్లు ఈఓ విజయ్‌కుమార్ తెలిపారు.


