భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో స్వామివారిని కొలువుదీర్చారు. నిత్య కల్యాణ మూర్తులకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో జరిగే శాశ్వత నిత్యాన్నదానానికి బుధవారం పాల్వంచకు చెందిన భక్తులు విరాళం అందజేశారు. శ్రీనివాస కాలనీకి చెందిన జరబన వెంకన్న చౌదరి రూ. లక్ష ఆలయ అధికారులకు అందించగా, వారు దాతలకు రశీదు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకుడు లింగాల సాయిబాబా, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారు.
రీసర్వే వేగవంతం చేయాలి
అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): రైతుల సమన్వయంతో రీ సర్వే వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. మండల పరిధిలోని నర్సాపురం శివారులో జరుగుతున్న రీ సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాగా, నర్సాపురం వెళ్తున్న క్రమంలో మధ్యలో రాళ్లవాగు నుంచి కారు వెళ్లే వీలు కాలేదు. బైక్‌పై వాగుదాటి, పొలాల గుండా సర్వే ప్రదేశానికి చేరుకున్నారు. తహసీల్దార్ స్వర్ణ, ఏడీ శ్రీనివాసరావు, సిబ్బంది రత్తయ్య, బాలకృష్ణ, పలువురు సర్వేయర్లు, రైతులు భీమిరెడ్డి శ్రీనివాస రెడ్డి, బన్నె ఏసుబాబు, చిన్నం వెంకటేశ్వర్లు. మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.
‘చేయూత’కు
19,345 దరఖాస్తులు
ముగిసిన పింఛన్ దరఖాస్తు గడువు
చుంచుపల్లి: కొత్త పింఛన్ల కోసం చేపట్టిన చేయూత దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. జిల్లాలో వివిధ కేటగిరీల కింద బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 19,345 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్ అందని వారు, కొత్తగా పింఛన్ పొందేందుకు అర్హత సాధించిన వారు చేయూత కింద దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధులు తప్ప వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర వర్గా ల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇక అధికారులు దరఖాస్తుల పరిశీలనపై దృష్టి పెట్టనున్నారు. వితంతువుల కేటగిరీలో 11,239, ఒంటరి మహిళలు 3,234, దివ్యాంగులు 4,778, చేనేత కార్మికులు ఒకరు, కల్లుగీత కార్మికుల విభాగంలో 93 చొప్పున దరఖాస్తులు అందాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 15,216 , పట్టణ ప్రాంతాల్లో 4,129 చొప్పున దరఖాస్తులు వచ్చాయని, రాత్రి వరకు ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయితే మరికొన్ని పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


