ముంపు ప్రాంతాల్లో గర్భిణుల వివరాలిలా..
హైరిస్క్‌లో 255 మంది
వరదల వేళ గర్భిణులపై ప్రత్యేక దృష్టి..
వైద్యాధికారుల ముందస్తు చర్యలతో సురక్షిత ప్రసవాలు
గర్భిణుల గుర్తింపు నుంచి ఆస్పత్రుల్లో ప్రసవం వరకు పకడ్బందీ ప్రణాళిక
భద్రాచలంఅర్బన్: ఏటా వరదల సమయంలో గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు కార్యాచరణ చేపడుతోంది. గర్భిణులను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అవసరమైన వైద్య సేవలు అందించడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యాన్ని కాపాడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతాలు, వరద ప్రభావిత గ్రామాల్లో నివసించే గర్భిణుల వివరాలను వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ముందుగానే సేకరించడంతో పాటు ప్రసవ తేదీ సమీపంలో ఉన్న మహిళలను ప్రత్యేకంగా గుర్తించి, వరద ఉధృతి పెరగక ముందే సమీప ప్రభుత్వ ఆస్పత్రులు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి గర్భిణి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రక్తపోటు, హిమోగ్లోబిన్, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన మందులు, పోషకాహారం అందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం అందేలా 108 అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచడంతో పాటు, రహదారి మార్గాలు నిలిచిపోయే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను కూడా ముందుగానే ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి వైద్యులు, సిబ్బంది, ఆపరేషన్ థియేటర్లు, రక్త నిల్వలు, అత్యవసర మందులు, నవజాత శిశువులకు అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచి 24 గంటల పాటు సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. క్లిష్ట గర్భధారణ ఉన్న మహిళలను ఉన్నత వైద్య కేంద్రాలకు ముందుగానే రిఫర్ చేసి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పిస్తూ పురిటి నొప్పులు ప్రారంభమైన వెంటనే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలిస్తున్నారు. జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, పోలీస్, విపత్తు నిర్వహణ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వైద్య శాఖ పనిచేయడం వల్ల వరదల సమయంలో కూడా గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయి. ఏటా చేపడుతున్న ఈ ముందస్తు చర్యలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో మాతా, శిశు మరణాలు తగ్గుతున్నాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
గోదావరి పరీవాహక ప్రాంతంలోని కరకగూడెం, పినపాక, జానంపేట, మోరంపల్లి బంజర, నర్సాపురం, దుమ్ముగూడెం, చర్ల, మణుగూరు, అశ్వాపురం, పర్ణశాల, సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గర్భిణులను తొలి ప్రమాద హెచ్చరిక సమయానికి చేరుస్తున్నారు. సాధారణ ప్రసవం సాధ్యమవుతుందని భావించిన గర్భిణులను అక్కడే ఉంచుతున్నారు. వరదల సమయంలో 24 గంటల పీహెచ్‌సీతోపాటు సాధారణ పీహెచ్‌సీలు కూడా 24 గంటలూ వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులకు చేరగానే హైరిస్క్ గర్భిణులను భద్రాచలం, మణుగూరు ఏరియా వైద్యశాలలకు తరలిస్తున్నారు.
వరదల వల్ల రాకపోకలు నిలిచిపోతాయేమో అనుకున్నాం. కానీ ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ప్రసవ తేదీ దగ్గర పడగా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాధారణ ప్రసవం ద్వారా ఆడ శిశువు జన్మించగా ప్రకృతి అని పేరు పెట్టాలనుకుంటున్నాం.
–పెనుబల్లి వసంత, చెరుపల్లి
వరద నీరు పెరుగుతుండటంతో ప్రసవం ఎలా జరుగుతుందో తెలియక కుటుంబంతా ఆందోళనలో ఉన్న సమయంలో వైద్యాధికారులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తలించారు. వైద్యులు సాధారణ ప్రసవం చేయగా ఆడ శిశువు జన్మించింది. ముందస్తు చర్యలతో ప్రమాదం తప్పింది. –భవాని, పైడాకులమడుగు
వరదల గురించి ఆలోచిస్తే భయమేసేది. వైద్యాధికారులు అవసరమైన సూచనలు ఇవ్వడంతో ఇప్పుడు ప్రసవంపై ఎలాంటి ఆందోళన లేదు. 4వ తేదీన వైద్యులు కాన్పు చేయనున్నారు. తల్లి కాబోతున్న ఆనందాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నా. భయం పోయింది.
–సంకీర్తన, బూర్గంపాడు
కలెక్టర్ అంకిత్, పీఓ రాహుల్ సూచనల మేరకు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రసవానికి రెండు నెలలు ఉన్న గర్భిణుల వివరాలు సేకరించి, సురక్షిత ప్రాంతాల్లోని ఏరియా ఆస్పత్రులకు తరలించాం. వారి ఆరోగ్య భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
–సైదులు, ఏడీఎంహెచ్‌ఓ, భద్రాచలం
నెల ప్రసవాలు హైరిస్క్
జూలై 216 51
ఆగస్ట్ 324 103
సెప్టెంబర్ 275 101
నదీ పరీవాహ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల పరిధిలో 900 మందికి పైగా గర్భిణులు జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో ప్రసవించనున్నట్లు వైద్యశాఖ గుర్తించింది. ఇందులో 250 మందికి పైగా హైరిస్క్ గర్భిణులు ఉండగా వీరిని భద్రాచలం, మణుగూరు ఏరియా ఆస్పత్రులకు తరలించగా.. కొందరు ప్రసవించారు. భద్రాచలం ఏరియా వైద్యశాలలో గర్భిణులు, జ్వరపీడితులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. 23 మంది గర్భిణులను తరలించగా వారిలో 8 మంది.. డివిజన్‌స్థాయిలో 18 మంది సురక్షితంగా ప్రసవించారని వైద్యాధికారులు తెలిపారు.


