గోదారి వరదతో మేత కరువు | - | Sakshi
Sakshi News home page

గోదారి వరదతో మేత కరువు

Aug 3 2026 12:37 AM | Updated on Aug 3 2026 12:37 AM

బూర్గంపాడు: గోదావరి వరదలతో ప్రజలు మాత్రమే కాకుండా పశువులు, జీవాలకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు. గోదావరి వరదలతో వాగులు, వంకలు నీటమునిగాయి. బూర్గంపాడు, నాగినేనిప్రోలు, మోతె పట్టీనగర్‌, ఇరవెండి గ్రామాల్లో మేకలు, గొర్రెలు మేతకు బయటకు వెళ్లేందుకు వీలు లేని దుస్థితి ఎదురైంది. శనివారం గోదావరి వరద పెరగడంతో పెంపకందారులు మేకలు, గొర్రెలను మేతకు తోలలేదు. ఆదివారం వరద తగ్గినా గడ్డిపై బురద ఉండటంతో జీవాలు మేతకు అలమటించాయి. వారం రోజులపాటు దూరప్రాంతాలకు వెళ్తే తప్ప జీవాలకు మేత దొరకదని చెబుతున్నారు.

ఆపదలో ఉన్న మిత్రుడికి చేయూత

రూ.2.25 లక్షలు అందించిన

పూర్వ విద్యార్థులు

నేలకొండపల్లి/ఏన్కూరు: నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంనకు చెందిన తాళ్లూరి గురుబ్రహ్మాచారికి ఆయన మిత్రులు అండగా నిలిచారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న ఆయనతో కలిసి ఏన్కూరు గురుకులంలో చదువుకున్న 1992 బ్యాచ్‌ మిత్రులు.. రూ.2.25 లక్షలు సేకరించి స్నేహితుల దినోత్సవమైన ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో అర్పినేని కృష్ణ, తిరునగిరి అనిల్‌, వంగూరి మల్లేశ్‌, పగిడిపల్లి పుల్లయ్య, చిప్పలపల్లి వెంకన్న, వేల్పుల సురేశ్‌బాబు, గుడిపూడి కృష్ణయ్య, బండి సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్‌ఫీహైవేపై

రాకపోకలకు అనుమతి

ఖమ్మం – దేవరపల్లి హైవేను

పరిశీలించిన మంత్రి తుమ్మల

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఖమ్మం రూరల్‌ మండలం తల్లంపాడు ఎంట్రీ పాయింట్‌ వద్ద ఆదివారం నుంచి వాహనాలకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్‌ లైట్లు అమర్చే పనులు జరుగుతుండడంతో భారీ వాహనాలు మినహా మిగతా వాహనాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యాన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం హైవేపై కొంతదూరం ప్రయాణించి పరిశీలించారు. కాగా, హైవేపై వాహనాల రాకపోకలను అనుమతించినా, ఎలాంటి అధికారిక ప్రారంభ కార్యక్రమం మాత్రం ఉండదని జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్‌ దివ్య తెలిపారు. ఢిల్లీ నుంచి అనుమతులు వచ్చాక టోల్‌ఫీజు వసూలు మమొదలవుతుందని వెల్లడించారు.

ఇన్నాళ్లు సోమవరం వద్ద...

హైవే పనులు కొద్ది నెలల క్రితమే పూర్తయినా ధంసలాపురం వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణం మాత్రం ఆలస్యమైంది. దీంతో వైరా మండలం సోమవరం వద్ద హైవేపైకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ధ్వంసలాపురం వద్ద బ్రిడ్జితో పాటు ఎగ్జిట్‌ నిర్మాణ పనులు, ఇతరత్రా అన్ని పూర్తవడంతో తల్లంపాడు ఎంట్రీ పాయింట్‌ నుంచి అనుమతిస్తున్నారు. ఖమ్మం – దేవరపల్లి హైవే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం వైపు ప్రయాణించే వారికి దూరం, సమయం తగ్గనున్నాయి.

వాగులోకి దిగిన

కార్మికుడికి ఫిట్స్‌

గుండాల: బహిర్భూమికని కిన్నెరసాని వాగులో దిగిన ఓ కార్మికుడికి ఫిట్స్‌ రావడంతో మృతిచెందిన ఘటన ఆళ్లపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. రామచంద్రయ్యగుంపు గ్రామానికి చెందిన తుమ్మ రాంబాబు (34) గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి మూర్చవ్యాధి ఉంది. శనివారం విధులు ముగించుకుని స్థానిక కిన్నెరసాని వాగు వద్దకు బహిర్భూమికని వెళ్లాడు. వాగులో దిగగానే ఫిట్స్‌ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాంబాబు ఇంటికి రాకపోవడంతో కటుంబసభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. కిన్నెరసానివాగులో విగతజీవిగా పడి ఉండగా ఆదివారం గుర్తించి, బోరున విలపించారు. కుటుంబ సభ్యుల పిర్యాధు మేరకు ఎస్‌ఐ సోమేశ్వర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement