ఈ ఏడాది నమోదు కాలేదు..
● జిల్లాలో వెలుగుచూస్తున్న వ్యాధి కేసులు ● ఫైలేరియా రహిత జిల్లాగా గుర్తింపునకు ఇంకా దూరమే ● త్వరలో 14 జిల్లాల జాబితాతో కేంద్ర ప్రభుత్వంప్రకటన ● జిల్లాలో మాత్రం భిన్నమైన పరిస్థితి.. ప్రస్తుతం 3,577 కేసులు
ఖమ్మంవైద్యవిభాగం: బోదకాలు రహితంగా జిల్లాను తీర్చిదిద్దాలని వైద్య, ఆరోగ్య శాఖ ఏళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం దక్కడం లేదు. ఎక్కడో ఓ చోట కేసులు వెలుగు చూస్తుండడంతో పూర్తిస్థాయిలో నిర్మూలన అసాధ్యంగానే మారుతోంది. ఒకప్పుడు రాష్ట్రాన్ని వణికించిన బోదకాలు (ఫైలేరియా) పలు జిల్లాల్లో పూర్తిస్థాయిలో నిర్మూలన దశకు చేరింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఆరేళ్ల కాలంగా మూడుసార్లు ‘ట్రాన్స్‌మిషన్ ఎసెస్‌మెంట్ సర్వే’చేయగా ఒక కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆయా జిల్లాలను ఫైలేరియా రహితంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. అయితే, ఈ జాబితాలో ఖమ్మం జిల్లాకు చోటు కోసం ఇంకొన్నాళ్లు వేచి ఉండక తప్పని పరిస్థితి ఎదురైంది.
జిల్లాలో బిన్నమైన పరిస్థితులు
ఫైలేరియా కేసులు పలు జిల్లాల్లో క్రమంగా తగ్గిపోతున్నా, ఖమ్మం జిల్లాలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా ఆరేళ్లు ఒక్క కేసు నమోదు కాకపోతే ఫైలేరియా రహిత జిల్లాగా ప్రకటిస్తారు. కానీ, జిల్లాలో అడపాదడపా కేసులు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 3,577 మంది ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్నారు. అందులో 1,396 మంది ప్రభుత్వం అందించే రూ.2,016 పింఛన్ తీసుకుంటున్నారు. సహజంగా ఫైలేరియా కేసులను వ్యాధి తీవ్రత ఆధారంగా మూడు గ్రేడ్లుగా విభజిస్తారు. మొదటి గ్రేడ్ బాధితులు జిల్లాలో 905 మంది ఉండగా, వీరికి వ్యాధి తీవ్రత నామమాత్రంగానే ఉంటుంది. దీంతో వీరికి పింఛన్ లభించదు. గ్రేడ్–2లో 1,302, గ్రేడ్–3లో 1,370 మంది ఉండగా.. పింఛన్ అందుతోంది. వీరిలో వృద్ధాప్య, వితంతువు పింఛన్లు తీసుకునే వారు ఉండడంతో 1,396 మంది మాత్రం ఫైలేరియా పింఛన్ పొందుతున్నారు.
అందని కిట్లు
జిల్లాలో గత రెండున్నరేళ్లలో ఆరు ఫైలేరియా కేసులు నమోదయ్యాయి. వాధి బాధితులకు గతంలో ఎంఎండీపీ ప్రోగ్రామ్ కింద కిట్లు ఇచ్చేవారు. అందులో బకెట్, మగ్గు, టవల్, సబ్బు, క్రీమ్ ఉండేవి. కానీ, చివరిసారి 2023లో 3,500 కిట్లు సరఫరా చేయగా.. ఆ తర్వాత ఊసే లేకపోవడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.
అవగాహనతోనే నిర్మూలన
బోదకాలు(ఫైలేరియా) అనేది పరాన్నజీవి పురుగుల వల్ల వచ్చే వ్యాధి. ఈ వ్యాధి కారక జీవులు కలిగిన క్యూలెక్స్ దోమలు కుట్టడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇది శరీరంలోని శోషరస వ్యవస్థను దెబ్బతీసి, చేతులు, కాళ్లు, వృషణాలు, ఇతర అవయవాల్లో వాపు కలిగిస్తుంది. తీవ్రమైన నొప్పి, కాళ్లు, చేతులు అసాధారణంగా పెద్దవిగా మారతాయి. తద్వారా కొందరిలో శాశ్వత వైకల్యం, నడవడం, పనిచేయడం కష్టంగా మారడమే కాక తరచూ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
జిల్లాలో ఫైలేరియా నిర్మూలనకు కృషి చేస్తున్నాం. 2024లో నాలుగు కేసులు, 2025లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ట్రాన్స్‌మిషన్ ఎసెస్‌మెంట్ సర్వే ద్వారా 3,150 మందికి పరీక్షలు చేయగా ఒక్క కేసూ రాలేదు. ఇలా వరుసగా ఆరేళ్ల పాటు ఒక్క కేసు నమోదు కాకపోతే జిల్లాను ఫైలేరియా రహితంగా ప్రకటిస్తారు. ఇది సాధించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నాం.
–వెంకట్లేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి


