కొరత, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు నూతన విధానం ఇప్పటికే రాష్ట్రంలో యాప్ ద్వారానే యూరియా అమ్మకాలు అన్నింటికీ కలిపి యాప్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం
ఖమ్మంవ్యవసాయం: ఎరువుల కొరత, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడంతో పాటు రైతులు క్యూలో నిలబడే ఇబ్బందులను తప్పించేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎరువుల కొనుగోళ్లకు డిజిటల్ విధానాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం యాప్‌ను రూపొందించింది. అంతర్జాతీయ పరిణామాలతో ముడి పదార్థాల ధరలు పెరగగగా గత ఏడాది వానాకాలం సీజన్ నుంచి యూరియా కొరత ఏర్పడింది. ఈ ఏడాది డీఏపీ (డై అమ్మోనియం పాస్ఫేట్)కి కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ ఎరువులను కేంద్రం సబ్సిడీపై సరఫరా చేస్తుండడం, ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో ఇబ్బందులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమాన గత యాసంగి సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూరియా పంపిణీకి ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ను అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా కేంద్రం యూరియాతో పాటు అన్ని ఎరువులను డిజిటల్ విధానంలో బుకింగ్ చేసుకునేలా చర్యలు చేపట్టింది.
భూమి ధ్రువీకరణతో..
ఎరువుల కొనుగోలును సులభం చేసేలా కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’బుకింగ్ యాప్‌ను తీసుకొస్తోంది. రైతులు స్మార్ట్ ఫోన్లలో ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆపై భూమి విస్తీర్ణాన్ని ధ్రువీకరించుకుని, రైతు ఆధార్ నంబర్‌ను నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. అది నమోదు చేసి లాగిన్ అయ్యాక ఎరువులను బుక్ చేసుకోవచ్చు.
ఈ నెల 6 నుంచి ఉమ్మడి జిల్లాలో..
కేంద్రం ఎరువుల కొనుగోళ్లకు నూతనంగా అమలు చేస్తున్న డిజిటల్ విధానాన్ని రాష్ట్రంలో దశల వారీగా అమలు చేయనుంది. ప్రయోగాత్మకంగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అమలు చేశారు. ఆపై మొదటి దశలో పది జిల్లాల నుంచి ఎంపిక చేయగా, ఇందులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ నెల 6 నుంచి పది జిల్లాల్లో ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ మొదలవుతుంది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ వంటి అన్ని రకాల ఎరువులను ఈ యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విధానంలో ఎరువుల బుకింగ్, కొనుగోలు సులభమవుతుందని ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య వెల్లడించారు. రైతులకు సందేహాలు ఉంటే అందుబాటులోని వ్యవసాయాధికారులు, డీలర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.


