చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలుక అటవీ ప్రాంతంలో ఆదివారం గేదెలపై ఒక్కసారిగా అటవీ జంతువు దాడి చేసింది. ఓ గేదె స్వల్పంగా గాయపడటంతో కాపరి వెళ్లి చూడగా ఏదో జంతువు అడవిలోకి వెళ్లిపోయినట్లు స్థానికులకు తెలిపాడు. అయితే వాగు ఒడ్డున కొన్ని చిరుత పులి అడుగుజాడలు ఉన్నట్లు అనుమానం రావడంతో అటవీ శాఖ అధికారులతో పాటు గ్రామస్తులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుత పులియేనా..? లేక ఇతర అటవీ జంతువా అనేది నిర్ధారించే పనిలో పడ్డారు. వదంతుల నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చాటింపు వేయిస్తున్నారు.
బొటిక్ సెంటర్‌లో చోరీ
జూలూరుపాడు: మండలంలోని వెంగన్నపాలెం ప్రధాన రహదారి పక్కన ఉన్న స్ఫూర్తి బొటిక్ టైలరింగ్ సెంటర్‌లో ఆదివారం చోరీ జరిగింది. గుండ్లరేవు గ్రామానికి చెందిన భూక్యా రమేశ్, కవిత దంపతులు కొంతకాలంగా వెంగన్నపాలెంనకు చెందిన సాయిల గోపాలరత్నం ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటూ మొదటి అంతస్తులో స్ఫూర్తి బొటిక్ టైలరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం దంపతులు రమేశ్, కవితలు ఇంటి తలుపులకు తాళం వేసి, వినోభానగర్‌లోని చర్చికి వెళ్లారు. తిరిగి ఇంటికి రాగా తలుపులు తీసి ఉండటాన్ని దంపతులు గమనించి, బీరువా తీసి చూడగా అందులో ఉన్న రూ.లక్ష నగదు, రెండు తులాల బంగారు పుస్తె బిళ్లలు కన్పించకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించారు. బొటిక్ సెంటర్‌లో కొన్ని రోజులుగా పని చేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యకితోపాటు, మరొకరు కలిసి చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ భూక్యా రమేశ్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, విచారణ చేపట్టారు.


