పాల్వంచరూరల్: కిన్నెరసాని కెనాల్లో పడి యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. కిన్నెరసాని డ్యామ్ దిగువన గల కేటీపీఎస్‌కు నీరు సరఫరా జరిగే కాల్వ వద్దకు కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన, బార్బర్ పనిచేసే తంగళ్లపల్లి సంతోష్ (24), తంగళ్లపల్లి నవీన్, ప్రవీణ్‌కుమార్, రాజేశ్ వచ్చారు. కెనాల్ వద్దకు సంతోష్ వెళ్లగా జారి నీటిలో పడ్డాడు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో కాల్వలో నీటి ప్రవాహాన్ని తగ్గించారు. సమీపంలోని కానిస్టేబుల్ రాంబాబు, డీర్ పార్కు వాచర్లు కల్యాణ్, ఇబ్ర హీం కాల్వలో దూకి సంతోష్‌ను బయటకు తీసుకొచ్చారు. కానీ, అప్పటికే మృతి చెందాడు. ఎస్‌ఐ సురేశ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, స్నేహితుల దినోత్సవం నాడు మిత్రులతో కలిసి వెళ్లిన యువకుడు విగతజీవిగా తిరిగి రావడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
స్నేహితుల దినోత్సవం నాడు విషాదం


