గుండాల: కలిసి చదువుకున్న స్నేహితులు ఏడాదికోసారి సమావేశం కావడం సాధారణమే. కానీ, సమాజ సేవచేస్తూ.. సమస్యలపై పోరాడుతున్న ఈ బృందం ఆదర్శంగా నిలుస్తోంది. గుండాలకు చెందిన ఆజాద్, వినోద్, వినయ్, సంతోష్, ప్రణయ్, శశి, శివ, ప్రసాద్, ఉదయ్, సతీశ్ 2009 – 10లో పదో తరగతి పూర్తిచేశారు. వీరు 2020లో నవచైతన్య యువజన సంఘంగా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉచిత చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా సమయాన పలువురి దహన సంస్కారాలు నిర్వహించారు. అలాగే, కరోనా బాధితులకు అవగాహన కల్పించి, మాస్క్‌లు, కిట్‌లు, నిత్యావసర సరుకులు అందించారు. ఇక 2024లో ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించి పలువురికి ఆపరేషన్ చేయించారు. నిరుపేదలు చనిపోతే వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు స్థానిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారానికి పాటుపడుతున్నారు. పలుమార్లు రక్తదాన శిబిరాలు సైతం నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ నిర్వహించిన యువజన సంఘం వీడియో కాన్ఫరెన్స్‌లో బృందం సభ్యులు పాల్గొన్నారు.


