దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాల, కాశీనగరం, దుమ్ముగూడెం, సున్నంబట్టి గ్రామాల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సున్నంబట్టి, బైరాగులపాడు గ్రామాల మధ్య, తూరుబాక ప్రధాన రహదారి పైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. పర్ణశాల ప్రధాన రహదారిపైకి వరద చేరడంతోపాటు సీతమ్మ విగ్రహం పూర్తిగా నీట మునిగింది. నారచీరల ప్రాంతంలోని దుకాణాదారులు తమ సామగ్రిని బయటకు తరలించారు. మంగ్వాయిబాడ్వ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎంపీడీఓ వివేక్‌రామ్, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీఓ వీరారెడ్డి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.


