పాల్వంచరూరల్/భద్రాచలం టౌన్: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున బియ్యం అందించనుంది. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను, తద్వారా ఏర్పడే రవాణా ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 443 రేషన్ దుకాణా ల పరిధిలో 3,26,606 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 3,05,511, అంత్యోదయ కార్డులు 2192, అన్నపూర్ణ కార్డులు 3 ఉన్నాయి. నెలకు 5,808 టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనుండగా, మూడు నెలలకు కలిపి 17,425 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ గోదాం నుంచి రేషన్ దుకా ణాలకు తరలించారు. కాగా, శనివారం నుంచి డీలర్లు బియ్యం పంపిణీ చేయనున్నారు.
వర్షాకాలంలో ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో రవా ణాకు అంతరాయం లేకుండా మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నేటి నుంచి బియ్యం పంపణీ ప్రారంభమవుతుంది. వచ్చే నెల చివరి వారం వరకు బియ్యాన్ని తరలింపు కొనసాగే అవకాశం ఉంది. పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. –త్రినాథ్‌బాబు, ప్రేమ్‌కుమార్,
పౌరసఫరాల శాఖ అధికారులు
నేటి నుంచి బియ్యం పంపిణీ చేయనున్న డీలర్లు


