జామాయిల్‌కే మొగ్గు.. | - | Sakshi
Sakshi News home page

జామాయిల్‌కే మొగ్గు..

Jul 31 2026 12:21 AM | Updated on Jul 31 2026 12:21 AM

పామాయిల్‌పై అనాసక్తి..

జిల్లాలో మళ్లీ పెరుగుతున్న సాగు

అపరాలు, నూనెగింజల సాగుపై రైతుల అనాసక్తి

పామాయిల్‌ సాగు కూడా అంతంతే..

జిల్లాలో ఈ ఏడాది జామాయిల్‌ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. ఎల్‌నినో ప్రభావంతో రైతులు వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన అపరాలు, నూనె గింజల పంటలు, ఉద్యానవన పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. ఆ దిశగా రైతులు అసక్తి చూపడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా జామాయిల్‌ సాగుకే మొగ్గుచూపుతున్నారు.

– బూర్గంపాడు

ముందుగానే సిద్ధం.

గత రెండేళ్లుగా పత్తి, వరి సాగులో వచ్చిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని రైతులు చాలామంది ముందుగానే జామాయిల్‌ సాగుకు పూనుకున్నారు. దీనికి తోడు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు కూడా జామాయిల్‌ సాగు విస్తీర్ణం పెరిగేందుకు కారణమైంది. జూన్‌ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 20వేల ఎకరాల వరకు జామాయిల్‌ సాగు కాగా ఇంకా 5వేల ఎకరాల వరకు సాగయ్యే అవకాశాలున్నాయి. గతంలో జిల్లాలో సుమారు 80వేల ఎకరాలకుపైగా సాగు కాగా రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశాలున్నాయి.

ప్రతికూల పరిస్థితులు..

వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటల సాగుకు ఏటికేడు పెట్టుబడులు పెరుగుతుండడంతో పాటు కూలీల కొరత, ఎరువుల ధరలు, గత సీజన్‌ నుంచి వచ్చిన ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్‌, ధాన్యం అమ్మకాలు తదితరాల కోసం రైతులు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులతో కొందరు రైతులు జామాయిల్‌ సాగు వైపు మళ్లారు. ఒకసారి మొక్కలు నాటి పైపాట్లు చేసుకుని.. ఏడాదికి ఒకట్రెండు సార్లు ఎరువులు వేసుకుంటే సరిపోతుంది కదా.. నీటి తడులు పెద్దగా అవసరం లేకపోగా మూడు, మూడున్నరేళ్లకు ఫలసాయమందుతుందని వీటి సాగుకే ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాక ఒకసారి ఎదిగిన పంటను నరికి విక్రయిస్తే మళ్లీ చిగురిస్తూ 12 ఏళ్ల వరకు ఫలసాయం పొందొచ్చు కదా, కూలీలు పెద్దగా అవసరముండదు అని చెబుతున్నారు. అయితే కర్ర నరికేటప్పుడు, కర్రను కొనుగోలు చేసిన వారే కూలీలకు నగదు చెల్లించుకుంటుండడంతో తక్కువ పెట్టుబడితో ఫలసాయమందే జామాయిల్‌ సాగుకు మొగ్గుచూపుతున్నారు.

పేపర్‌కు ముడిసరుకుగా..

ఆసియా ఖండంలోనే అతిపెద్ద పేపర్‌ పరిశ్రమ ఐటీసీ పీఎస్‌పీడీ సారపాకలో ఉంది. ఈ పరిశ్రమ నిర్వహణకు జామాయిల్‌ కర్రే అతి ముఖ్యమైన ముడిసరుకు కావడంతో ఐటీసీ పీఎస్‌పీడీకి వచ్చే కలపలో 95శాతం సరఫరా ఇక్కడే ఉంటుంది. ఈ పరిశ్రమతో జిల్లా రైతులకు మార్కెటింగ్‌ వసతులు మెరుగ్గా ఉండగా.. రైతులు నేరుగా తీసుకు రావడం లేదా ఐటీసీ పీఎస్‌పీడీ అనుమతి పొందిన కాంట్రాక్టర్లు నేరుగా జామాయిల్‌ తోటలకు వచ్చి రైతులతో మాట్లాడి కర్రను ఐటీసీకి తరలిస్తారు. మార్కెటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకపోవటంతో కర్ర అమ్మిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమవుతున్నాయి. ఈ పరిస్థితులు రైతులను జామాయిల్‌ సాగువైపు నడిపిస్తున్నాయి. పదిహేనేళ్ల క్రితం కూడా జిల్లాలో రైతులు విపరీతంగా జామాయిల్‌ సాగు చేశారు. అయితే ఐటీసీ పీఎస్‌పీడీ కర్ర ధరను తగ్గిస్తు వస్తుండటంతో రైతులు కూడా తోటలను తొలగిస్తూ వచ్చారు. గత ఐదారేళ్లుగా మళ్లీ జామాయిల్‌ కర్రకు ధరలు పెరగటం, ఐటీసీ పీఎస్‌పీడీతో పాటుగా ఫ్లైవుడ్‌ తయారీ కంపెనీలు కూడా కొనుగోలు చేస్తుండటంతో రైతులు మళ్లీ జామాయిల్‌ సాగు చేపడుతున్నారు.

వ్యవసాయశాఖ అధికారులు పామాయిల్‌ సాగు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నా.. వారు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సాగుకు ఆసక్తి చూపడం లేదు. పామాయిల్‌ గెలల ధరలు టన్నుకు రూ.23 వేల వరకు ఉన్నప్పటికీ తోటల నుంచి గెలల తరలింపు, మార్కెటింగ్‌ వసతులు సరిగా లేవని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోనే పామాయిల్‌ క్రషింగ్‌ మిల్లులు, మొక్కల నర్సరీలున్నాయి. పలువురు రైతులు పామాయిల్‌ సాగు చేయాలని ఆలోచన ఉన్నా.. మార్కెటింగ్‌, రవాణాకు సరైన వసతులు లేని కారణంగా వెనకడుగువేస్తున్నారు. జిల్లాలో పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాలలో పామాయిల్‌ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి.

ప్రత్యామ్నాయ పంటగా జామాయిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement