వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం | - | Sakshi
Sakshi News home page

వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

Jul 31 2026 12:21 AM | Updated on Jul 31 2026 12:21 AM

మణుగూరు టౌన్‌: సింగరేణి కాలరీస్‌ మణుగూరు ఏరియాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓబీ వెలికితీత కూడా నిలిచిపోయింది. బుధవారం 24 వేల టన్నుల బొగ్గు వెలికితీయాల్సి ఉండగా, 12 వేల టన్నులే తీశారు. గురువారం కూడా వర్షం కొనసాగడంతో మొదటి, రెండు షిఫ్టుల్లో ఓబీ వెలికితీతకు, బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. కాగా క్వారీల్లో నిలిచిన వరద నీటిని మళ్లించేందుకు సింగరేణి అధికారులు చర్యలు చేపట్టారు.

2న చెస్‌ ఎంపిక పోటీలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెం మేదరబస్తీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఐటీఐలో అండర్‌– 13, అండర్‌–10 చెస్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి సీహెచ్‌ గోపికృష్ణ, ప్రెసిడెంట్‌ చల్లా భాస్కరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 2న పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.

సఖి సెంటర్‌కు

ఛత్తీస్‌గఢ్‌ మహిళ

ఇల్లెందురూరల్‌: మండలంలోని రాఘబోయినగూడెం గ్రామపంచాయతీ గోపాలపురం గ్రామానికి రెండు రోజుల క్రితం ఓ మహిళ రాగా మతిస్థిమితం కోల్పోయి దారితప్పి వచ్చిందని గ్రామస్తులు అనుమానించారు. ఇదే సమయాన గ్రామంలోని అంగన్‌వాడీ టీచర్‌ ఆమెను చేరదీసి ఆశ్రయం కల్పించి సర్పంచ్‌ ఈసాల సురేష్‌, ఐసీడీఎస్‌ అధికారులకు సదరు మహిళ సమాచారాన్ని అందించింది. ఈమేరకు వారు పోలీసు శాఖ సహకారంతో గురువారం కొత్తగూడెం పట్టణంలోని సఖి కేంద్రానికి తరలించారు. ఆమె మాటలను బట్టి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందినదిగా సఖి అధికారులు నిర్థారించగా.. స్వరాష్ట్రానికి క్షేమంగా చేర్చాలని సర్పంచ్‌ అధికారులను కోరారు.

ఎన్‌ఎండీసీ కర్మాగారాన్ని పునఃప్రారంభించాలి

పాల్వంచ: పాల్వంచలో ఉత్పత్తి నిలిచిపోయిన ఎన్‌ఎండీసీ కర్మాగారాన్ని పునఃప్రారంభించాలని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఏ.జలీల్‌, పాల్వంచ ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ బాలు నాయక్‌లు కోరారు. ఈమేరకు వారు ఢిల్లీలో వారం రోజులుగా మకాం వేసి తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, డీ.కే.శివకుమార్‌, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఏఐసీసీ కేరళ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌, సీడబ్ల్యూసీ మెంబర్‌ గురుదీప్‌ సప్పల్‌తో పలువురు మంత్రులను కలిసి వినతి పత్రాలను అందించారు. అదేవిధంగా కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ను కలవనున్నారు. ఎన్‌ఎండీసీ కర్మాగారం తిరిగి ప్రారంభమైతే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయని, పాల్వంచ పారిశ్రామికంగా పూర్వవైభవం పొందే అవకాశం ఉందని వివరించారు.

గోండి–కోయ భాష వర్క్‌షాప్‌ నిర్వహించాలి

భద్రాచలంటౌన్‌: భద్రాచలంలో 12వ జాతీయ గోండి–కోయ భాష ప్రామాణికరణ వర్క్‌షాప్‌ను నిర్వహించేందుకు సహకరించాలని కోరుతూ గిరిజన ప్రతినిధుల బృందం గురువారం ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన 11వ జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్న భద్రాచలం ప్రతినిధులు స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీఓను కలిశారు. ఈ సందర్భంగా గోండి–కోయ భాషకు అధికారిక గుర్తింపు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి సిఫార్సు చేయాలని వారు కోరారు. దీనిపై పీఓ సానుకూలంగా స్పందిస్తూ కోయ భాష అభివృద్ధికి, పరిరక్షణకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఛత్తీస్‌గఢ్‌ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ప్రతినిధులకు ఆయన పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మడివి నెహ్రూ, పీసోడి కన్నయ్య, పాయం వెంకటరత్నం, ఇర్ప రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

వాహనాల వేలం @ రూ.8.45 లక్షలు

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ. 8.45 లక్షల ఆదాయం సమకూరినట్లు ఎకై ్సజ్‌ సీఐ రహిమున్నీ బేగం తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో వేలం వివరాలను ఆమె వెల్లడించారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి ఎ. శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 29న మొత్తం 54 వాహనాలకు బహిరంగ వేలం వేయగా.. అందులో 53 వాహనాలు విక్రయమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఈ వేలం ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా జరిగిందని, దీని ద్వారా రూ. 8.45 లక్షల రాబడి వచ్చిందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement