ఘాటెక్కుతున్న మిర్చి! | - | Sakshi
Sakshi News home page

ఘాటెక్కుతున్న మిర్చి!

Jul 31 2026 12:21 AM | Updated on Jul 31 2026 12:21 AM

● రూ.23వేలు దాటిన ‘తేజా’ మిర్చి ధర ● తగ్గుతున్న నిల్వలతో పెరుగుతున్న డిమాండ్‌

● రూ.23వేలు దాటిన ‘తేజా’ మిర్చి ధర ● తగ్గుతున్న నిల్వలతో పెరుగుతున్న డిమాండ్‌

ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర ఘాటెక్కుతుంది. మూడు రోజుల వ్యవధిలో క్వింటాకు రూ.350 పెరిగింది. గత వారం వరకు రూ.22 వేలు ఉన్న ‘తేజా’ మిర్చి ధర ప్రస్తుతం రూ.23 వేల మార్కును దాటింది. ఖమ్మం మార్కెట్‌లో సోమవారం రూ.22,700 పలికిన ధర మంగళవారం రూ.22,750, బుధవారం రూ.22,800కు చేరగా గురువారం ఏకంగా రూ. 23,050గా నమోదైంది. మిర్చి సీజన్‌ అయిన మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సగటున రూ.18వేలు పలికిన ధర ప్రస్తుతం రూ.5 వేలు పెరిగింది. కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.23,050, మోడల్‌ ధర రూ.22 వేలుగా, నాన్‌ ఏసీ మిర్చి గరిష్టంగా రూ.17,400, మోడల్‌ ధర రూ.16,500గా నమోదైంది. అలాగే, తాలు మిర్చి ధర రూ. 10 వేలుగా పలుకుతోంది.

దేశ, విదేశాలకు ఆర్డర్లు

తేజా రకం మిర్చికి దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. గత ఏడాది పంట సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడులు లేకపోవడంతో ఆశించిన విధంగా మిర్చి నిల్వలు లేవు. దీనికి తోడు ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకుని మిరప సాగుపై రైతుల్లో ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఈ ఏడాది కూడా మిరప దిగుబడులు తగ్గే అవకాశముంది. ఇలా రకరకాల కారణాలతో మిర్చి నిల్వ లకు డిమాండ్‌ పెరుగుతుంది. దేశీయంగా ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌ నుంచి మిర్చి ఆర్డర్లు వస్తుండడంతో వ్యాపారులు ధర పెంచుతున్నారని తెలుస్తోంది.

కరిగిపోతున్న నిల్వలు

మిర్చి నిల్వలు తగ్గుతున్న సమయాన డిమాండ్‌ పెరుగుతుంది. జిల్లాలోని 48 కోల్డ్‌ స్టోరేజీల్లో దాదాపు 48 లక్షల బస్తాల మిర్చిని రైతులు, వ్యాపారులు సీజన్‌లో నిల్వ చేసినట్లు అంచనా. ప్రస్తుతం పంట పెట్టుబడుల కోసం రెండు నెలలుగా ఈ మిర్చిని విక్రయిస్తున్నారు. దీంతో కోల్డ్‌ స్టోరేజీల్లో కూడా నిల్వలు సగానికి చేరినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement